కోవిడ్‌పై పోరుకు ”కరోనా కర్ఫ్యూ” విధించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రదేశాల్లో కరోనా గురించి అప్రమత్తం చేసేందుకు ”కరోనా కర్ఫ్యూ” అని పేర్కొనాలని అన్నారు. ఈ కర్ఫ్యూ రాత్రి 9, 10 గంటల నుంచి ఉదయం 5, 6 గంటల వరకు ఉండాలని సూచించారు. ఈ నెల 11 నుంచి 14 వరకు ”టీకా ఉత్సవ్” నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రెండో దశ కరోనా విజృంభించడంతో ఆయన వర్చువల్‌గా గురువారం నిర్వహించిన సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనార్జీ సమావేశానికి గైర్హాజరయ్యారు.
కరోనా సోకడంతో వైద్యం కోసం ప్రభుత్వ ఆసుప్రతిలో చేరిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా హాజరుకాలేదు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రులకు సూచించారు. రోజువారీ కేసులు పెరుగుతున్నాయని, మరణాల రేటు సాధ్యమైనంత తక్కువగా ఉందని నిర్ధారించామని తెలిపారు.
దేశంలో మరోసారి లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితి ఓ సవాలుగా మారుతోందన్న ఆయన కరోనాతో పోరాటం చేసేందుకు సలహాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రులను కోరారు. మళ్లీ ఒక సవాల్ పరిస్థితి ఏర్పడిందని, పరిస్థితిని పరిష్కరించడానికి సలహాలు ఇవ్వాలని కోరారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్ మార్గమని సూచించారు.
సూక్ష్మ కంటోన్మెంట్ జోన్లపైన, విస్తృతమైన కరోనా పరీక్షలపైన దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలు 70 శాతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చినా సరే పరీక్షలు ఎక్కువగా చేయాలని ప్రధాని సూచించారు. సవాళ్లు ఉన్నప్పటికీ మనకు అనుభవం, వనరులు, వ్యాక్సిన్ ఉందని ప్రధాని భరోసా ఇచ్చారు.
వ్యాక్సిన్ పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వ్యాక్సిన్‌ను ఒకే రాష్ట్రంలో ఉంచడం ద్వారా ఫలితం పొందలేమని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా పరీక్షల గురించి మర్చిపోయామని, వ్యాక్సిన్ వరకు వెళ్లామని చెప్పారు. వ్యాక్సిన్ లేకుండానే కరోనా వ్యతిరేక పోరులో విజయవంతమయ్యామని గుర్తుంచుకోవాలని సూచించారు.
కరోనా కేసులలో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లతో సహా అనేక రాష్ట్రాల్లో మొదటి దశ కంటే కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే టీకాలు వృథా కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న తరువాత కూడా దేశ ప్రజలు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని మోదీ స్పష్టం చేశారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు