కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు

కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు
 

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనందున వైరస్ పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా ఉండరాదని ప్రధాని నరేంద్ర మోదీ  దేశ ప్రజలను కోరారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి, స్వీయనియంత్రణ చర్యలు తీసుకోకపోతే ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. గురువారం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో కరోనా టీకా రెండో డోసు వేయించుకున్నారు. 

మార్చి 1న మోడీ మొదటి డోసు టీకా వేయించుకున్నారు. 37 రోజుల తర్వాత గురువారం రెండో డోసు టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా టీకా వేయించుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం రాదని, టీకా పట్ల అపోహలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. 

అర్హులైన ప్రతిఒక్కరు టీకా వేయించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కరోనాను జయించడానికి అనేక మార్గాలు ఉన్నాయని, అందులో కరోనా టీకా వేయించుకోవడం ఒకటని ఆయన పేర్కొన్నారు. టీకా వేయించుకోవడం కోసం CoWin.gov.inలో తమ పేర్లు  రిజిస్టర్‌ చేసుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ లో ఇప్పటివరకు 9 కోట్ల మంది కరోనా టీకా వేయించుకున్నారు.

ప్రధాని మోదీకి ఇద్దరు నర్సులు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చారు. వారిలో మొదటి డోసు ఇచ్చిన సిస్టర్‌ పీ. నివేదిత, నిషా శర్మ ఉన్నారు. నివేదిత పుదుచ్చేరికి చెందినవారుకాగా, నిషా శర్మ పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారు. దేశంలో ఇప్పటివరకు 9 కోట్లకుపైగా మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

ఇలా ఉండగా, కరోనాపై పోరులో కీలకమైన వాక్సినేషన్ లో భారత్ దూసుకెళ్తోంది. టీకా వేయడంలో తొలి ప్లేస్ లో ఉన్న అగ్రరాజ్యం అమెరికాను అధిగమించింది. తద్వారా వేగవంతంగా వాక్సినేషన్ చేస్తున్న దేశంగా భారత్  నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 

వ్యాక్సినేషన్ లో యూఎస్ ను దాటేసి ప్రపంచంలో అత్యంత వేగంగా ముందుకెళ్తున్న దేశం మనదేనని జవదేకర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కరోనా మీద పోరును మరింత వేగవంతం చేద్దామంటూ ట్వీట్ చేశారు.