అనిల్‌ దేశ్‌ముఖ్‌ బాటలో మరో ఇద్దరు మంత్రులు!

అవినీతి ఆరోపణలపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా నేపథ్యంలో రానున్న పదిహేను రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా బాటపడతారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు. మహారాష్ట్ర పరిణామాలు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అనువుగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 

తాను సర్వీసులో కొనసాగాలంటే రూ రెండు కోట్లు చెల్లించాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌ డిమాండ్‌ చేశారని, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలుచేయాలని రవాణా మంత్రి అనిల్‌ పరబ్‌ కోరారని సస్పెన్షన్‌కు గురైన ముంబై మాజీ పోలీస్‌ అధికారి సచిన్‌ వజే ఆరోపించిన క్రమంలో చంద్రకాంత్‌ పాటిల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

రెండు వారాల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని, వీరికి వ్యతిరేకంగా కొందరు కోర్టును ఆశ్రయిస్తారని, అప్పుడు వారు కేబినెట్‌ నుంచి నిష్క్రమిస్తారని ఆయన నర్మగర్భంగా పేర్కొన్నారు. అయితే ఆ మంత్రులు ఎవరనేది వారి పేర్లను బీజేపీ నేత వెల్లడించలేదు. మహా వికాస్‌ అఘడి ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్ధీకృత నేరాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

ప్రతి చిన్న విషయంలోనూ ఉద్ధవ్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానిదే తప్పంటూ విరుచుకుపడుతోందని, అలాంటి సమయంలో పాలన మొత్తం కేంద్రం చేతిలో పెడితే సరిపోతుంది కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉద్ధవ్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థీకృతమైన నేరాల్లో కూరుకుపోయిందని చంద్రకాంత్ పాటిల్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పోలీస్ శాఖకు ఏమాత్రం మంచివి కావని పాటిల్ హితవుపలికారు.