బీజేపీ నేతపై పోలీస్‌ కాల్పులు.. హత్యకు కుట్ర?

బీజేపీ నేతపై స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ) పోలీసులు కాల్పులు జరిపారు. అయితే కారును ఆయన వేగంగా నడుపడంతో ప్రాణాలతో బయటపడ్డారు. తన హత్యకు కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 

ఐలం కస్బాకు చెందిన అధికార బీజేపీ నేత అశ్వని పవార్‌ కొంత మందితో కలిసి కారులో ఢిల్లీ-సహాన్‌పూర్‌ రోడ్డులో ప్రయాణిస్తున్నారు. రోడ్డు మధ్యలో కారు స్లో చేయగా షామ్లీ జిల్లాకు చెందిన ఎస్‌వోజీ పోలీసులు తుపాకులతో ఆ కారును చుట్టుముట్టి కాల్పులు జరుపారు. గమనించిన అశ్వని పవార్‌ కారును వేగంగా డ్రైవ్‌ చేశారు. దీంతో పోలీసులు కారును వెంబడించి కాల్పులు జరిపారు. 

ఈ ఘటనలో కారులో ఉన్న మనీశ్‌ కుమార్‌ అనే వ్యక్తికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు తన ఇంటికి వచ్చి తనను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారని, రాత్రంతా వేధింపులకు గురిచేశారని, తప్పులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారని అశ్వని పవార్‌ ఆరోపించారు. ఉదయానికి తన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోవడంతో తాను ఎస్‌వోజీ పోలీసుల చెర నుంచి బయటపడినట్లు చెప్పారు.

రెస్టారెంట్‌లో తిందామని తన పిల్లలు కోరడంతో గత రాత్రి కారులో బయటకు వెళ్లామని పేర్కొన్నారు. పెట్రోల్‌ బంకు వద్ద పెట్రోల్‌ నింపుకుని రోడ్డుపైకి రాగా స్వైపింగ్‌ మెషిన్‌ కారుపై ఉన్నట్లు గ్రహించి బంకు సిబ్బందిని పిలిచానని అశ్వని పవార్‌ చెప్పారు. ఇంతలో ఎస్‌వోజీ పోలీసులు తన కారును చుట్టుముట్టి కాల్పులు జరుపగా వేగంగా నడిపి తప్పించుకున్నట్లు వివరించారు. 

అప్పటికే పోలీసులు 10-15 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిపారు. పోలీసులు తన ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని తనను హత్య చేసేందుకు కుట్రపన్నారని అశ్వని పవార్‌ ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు అశ్వని పవార్‌ కారును పోలీసులు చుట్టిముట్టి కాల్పులు జరిపిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు షామ్లి ఎస్పీ సుకీర్తి మాధవ్ తెలిపారు.