ఎన్నికలు పూర్తి …. ఇక మిగిలింది బెంగాలే

Kolkata: People casting their votes at Hooghly in West Bengal on Tuesday, 06 April, 2021. (Photo:IANS)

మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక పశ్చిమ బెంగాల్లోనూ మూడో దశ ఎన్నికలు పూర్తి కాగా, మరో ఐదు దశలు ఎన్నికలు పూర్తి కావలసి ఉంది.  మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు తమిళనాడులో 71.79 శాతం, కేరళలో 77.02 శాతం,  బెంగాల్లో 77.68 శాతం, అస్సాంలో 82.28 శాతం పోలింగ్ నమోదైంది. 

ఇక పుదుచ్చేరిలో 81.88 శాతం మంది ఓటేశారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే ఫేజ్లో ఎన్నికలు జరగ్గా.. వెస్ట్ బెంగాల్లో థర్డ్ ఫేజ్, అస్సాంలో లాస్ట్ ఫేజ్ పూర్తయింది. ఎన్నికల కౌంటింగ్ మే 2న జరగనుంది.
234 సీట్లున్న తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అన్నాడీఎంకే నేతలు పళనిస్వామి, పన్నీర్సెల్వం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, పుదుచ్చేరి ఇన్చార్జి గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై తదితరులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

డ్యూటీలో ఒకరిద్దరు పోలింగ్ ఆఫీసర్లు చనిపోయారంటూ వార్తలు రాగా, అలాంటి రిపోర్టులేవీ తమకు రాలేదని సీఈవో సత్యబ్రత సాహూ చెప్పారు. చాలా తక్కువ చోట్ల ఈవీఎంలు మొరాయించాయని, తర్వాత సరిచేశామని తెలిపారు. కరోనా పేషెంట్లు సాయంత్రం 6 నుంచి 7 మధ్య వచ్చి ఓట్లేశారు. కోయంబత్తూరులో పోలింగ్ బూత్ బయట డబ్బులు పంచుతున్నారని కమల్ హాసన్ ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేస్తానన్నారు. ఇక 30 సీట్లున్న పుదుచ్చేరిలోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

కేరళలో జనం ఓటెత్తారు. ఎండను లెక్క చేయకుండా ఓటు వేసేందుకు తరలివచ్చారు. చాలా పోలింగ్ సెంటర్ల వద్ద క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. సీఎం పినరయి విజయన్, మెట్రో మ్యాన్ శ్రీధరన్, ఒమన్ చాందీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య శబరిమల అంశంపై మాటల యుద్ధం నడిచింది. ఇక అక్కడక్కడ గొడవలు జరిగాయి. సీపీఎం కార్యకర్తలు దాడి చేయడంతో పయ్యనూర్లో ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆస్పత్రి పాలయ్యారు. 

అరన్ములా, చవిత్తువరి ప్రాంతాల్లో ఇద్దరు వృద్ధులు క్యూలైన్లలో కుప్పకూలి చనిపోయారు. కాజాకూటం సెగ్మెంట్లో బీజేపీ, సీపీఎం వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఎల్డీఎఫ్ మరోసారి అధికారంలోకి వస్తుందని  పినరయి విజయన్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో బీజేపీకి వచ్చిన ఒక్క సీటు కూడా ఈ సారి రాదన్నారు. 140 సీట్లు ఉన్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 957 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
బెంగాల్లో మూడో దశ ఎన్నికల్లోనూ హింస చోటుచేసుకుంది. కొందరు అభ్యర్థులపై దాడులు చేశారు.31 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 78 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. బీజేపీ కార్యకర్తలు పోలింగ్ బూత్లను ఆక్రమించుకుంటున్నారని.. టీఎంసీ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులు  చేస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అరంబాగ్లో టీఎంసీ అభ్యర్థి సుజాతా మొండల్ ఖాన్పై కొందరు దాడి చేశారు.