నీతి అయోగ్ స్పెషల్ సెక్రటరీగా నల్లగొండ జిల్లా వాసి రాజేశ్వర్

ప్రతిష్టాత్మకంగా నీతి అయోగ్‌లో కీలక స్థానంలో తెలంగాణకు చెందిన వ్యక్తి నియమతులయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన కొలనుపాక రాజేశ్వర్ రావును స్పెషల్ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
డాక్టర్ రాజేశ్వర్‌రావు 1988 ఐఎఎస్ బ్యాచ్‌లో త్రిపుర కేడర్‌కు అలాట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన నీతి అయోగ్‌లో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రాజేశ్వర్ రావు సోషల్ సైన్స్‌లో డాక్టరేట్ చేశారు, నేషనల్ సెక్యూరిటిలో ఎంఫిల్ పూర్తి చేశారు. అలాగే సైకాలజిలో పిజి, జర్నలిజంలో పిజి చేశారు. 
 
రాజేశ్వర్ రావు నీటిపారుదల రంగ నిపుణుడు దివంగత విద్యాసాగర్ రావు మేనల్లుడు. జాతీయ స్థాయిలో మినరల్ పాలసీ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించి పాలసీని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
 
పిఎం జన ఆరోగ్య యోజన పథకం మార్గదర్శకాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన నీతి అయోగ్‌లో స్పెషల్ సెక్రటరీగా నియమితులు కావడం తెలంగాణ వ్యక్తిగా గర్విస్తున్నానని తెలిపారు. తాను ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం తన తల్లి కారణమని ఆయన తెలిపారు. 
 
తండ్రి చిన్నతనంలోనే చనిపోయినా నలుగు అక్కలను, ముగ్గురు అన్నదమ్ములైన తమను పెంచి మంచి చదువులు చదివించి ఈ స్థాయికి రావడానికి కారణమైందని ఆయన వివరించారు. తనతో పాటుగా తన మేనల్లుళ్లు ఇద్దరు కూడా ఐఏఎస్‌కు ఎంపికయ్యారని, వారిలో ఒకరు కృష్ణ అదిత్య ములుగు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. మరోకరు కృష్ణ చైతన్య మధ్య ప్రదేశ్ కేడర్ ఐఎఎస్‌గా పనిచేస్తున్నారని వివరించారు.