‘నలుగురు’ ఎమ్మెల్యేలపై కేసీఆర్ చర్య తీసుకుంటారా?

కేసీఆర్ మంత్రులే స్వయంగా భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతున్న ఆడియోలు బయటకు వస్తున్నాయన్నాయంటూ బిజెపి నేత విజయశాంతి ఫేస్‌బుక్‌లో ఫైరయ్యారు. మరోవైపు, ఆ ‘నలుగురు’ ఎమ్మెల్యేలు డ్రగ్స్ పార్టీలకు సంబంధించి తీవ్ర ఆరోపణల్లో చిక్కుకున్నారని గుర్తు చేశారు. 
 
నోరు విప్పితే చాలు తెలంగాణలో పరిపాలన గొప్పగా ఉందనే ముఖ్యమంత్రికి వీరిపై చర్యలు తీసుకునే దమ్ముందా? అని ఆమె ప్రశ్నించారు. ఆ మంత్రిని తొలగించగలరా? అని సవాలు విసిరారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పక్కదారి పట్టిందని, అరాచకం రాజ్యమేలుతోందని విజయశాంతి విమర్శించారు.

కనీసం ఆ ఎమ్మెల్యేలపై పార్టీ పరంగానైనా చర్యలు తీసుకోగలరా? అని విజయశాంతి నిలదీశారు. ఓవైపు అవినీతి, అనైతిక వ్యవహారాలు యథేచ్ఛగా సాగుతుంటే మరోవైపు, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఉద్యోగాలు రాని యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

కరోనా కట్టడి విషయంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజుకు 7,600 ఆర్టీపీసీఆర్ టెస్టులు చెయ్యాలని కేంద్రం చెబితే నాలుగైదు వేలు కూడా దాటడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో టెస్టులు చేసే మిషన్లు లేక ప్రైవేటుకు పంపిస్తున్నారని విజయశాంతి ఆరోపించారు.

కరోనా కట్టడికి మద్యం దుకాణాలు,  బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు తక్కువగా చేస్తున్నారని హైకోర్టు మందలించినా ఈ రాతి గుండె సర్కారు మారడం లేదన్నారు. ఈ పాలకుల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం అత్యాశే అవుతుందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.