తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కొవిడ్‌ సోకినట్లు సీఎస్‌ స్వయంగా వెల్లడించారు. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం అందలేదు.
 
నిన్న సీఎం కేసీఆర్‌తో  సోమేష్‌కుమార్‌ సమావేశమయ్యారు. ఇటీవల  ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. ప్రతీ రోజు సీఎంతో సోమేష్‌కుమార్‌ సమీక్షల్లో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల తనను కలిసిన వారిలో ఎవరికైనా లక్షణలు కనిపిస్తే వెంటనే  కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సోమేశ్‌కుమార్‌ సూచించారు.
 
ఇవ్వాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా తీవ్రతను నియంత్రించడంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ లకు ఆదేశించారు. గత కొన్ని రోజులుగా కరోనా తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, వ్యాక్సిన్ పంపిణీ, కోవిడ్ టెస్ట్ లు తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. 
 
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, మండల స్థాయి అధికారులు అన్ని వేళల అప్రమత్తంగా ఉండాలన్నారు. రోజువారి చేస్తున్న కొవిడ్ టెస్టులను పెంచాలని, పాజిటివ్ కేసులు, కాంటాక్ట్ కేసులను గుర్తించాలన్నారు. సంబంధితులను హోం ఐసోలేషన్ లో ఉంచాలని సూచించారు. హోమ్ ట్రీట్మెంట్ కిట్స్ ను పంపిణీ చేయాలని తెలిపారు. 
 
 మరోవంక,తెలంగాణలో పెరుగుతున్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల‌పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది.  కరోనా‌కు సంబంధించిన టెస్ట్‌లపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే ఈ విషయంలో ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్‌లు తక్కువ చేయడంపై ప్రభుత్వం తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 
 
9.7 లక్షల కరోనా టెస్ట్‌లకు గానూ 7 లక్షల ర్యాపిడ్ టెస్ట్‌లు చేసినట్లు ప్రభుత్వం రిపోర్ట్‌లో పేర్కొంది. నేడు విచారణలో భాగంగా 48 గంటల్లో రిపోర్ట్ సమర్పించాలని హైకోర్టు  ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ర్యాపిడ్ టెస్ట్‌లకు సంబంధించిన రిపోర్ట్‌ను ప్రభుత్వం  హైకోర్టుకు మధ్యాహ్నానికే సమర్పించింది. అయితే రిపోర్ట్‌పై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.