యూట్యూబ్ ఛానల్స్ పై విజయశాంతి కన్నెర్ర 

గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలవని ఏ హీరోనూ తాను సమర్థించనని స్పష్టం చేస్తూ  కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తనపై చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నానని లేడీ బిజెపి నేత, సినీ నటి విజయశాంతి వెల్లడించారు. 

కొందరు నటులను, కొన్ని సినిమాలను విజయశాంతి ప్రశంసించినట్టు కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ప్రచారం చేస్తున్నాయి. ఆ ప్రచారంపై విజయశాంతి ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. 

`ఏవో కొన్ని సినిమాలను, కొందరు నటులను నేను మెచ్చుకున్నట్టు, కొన్ని సందర్భాలలో విమర్శించినట్టు పలు యూట్యూబ్ ఛానెళ్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. తెలంగాణలో ఆయా సినిమాలకు పబ్లిసిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 వీటిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అడుగుతున్న అభిమానుల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటా అని తెలిపారు. తాను ఏం చెప్పాలనుకున్నా స్వయంగా మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తాను అని స్పష్టం చేశారు. 

ఇంకా చెప్పాలంటే, నాటి మా తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు సమర్థించని ఏ హీరోకూ, వారి సినిమాలకూ నేను మద్దతివ్వను. నేడు కేసీఆర్‌గారు ఒక అవగాహనతో సమర్థిస్తున్న తీరులో నేను మాట్లాడటం ఎప్పటికీ జరగదని విజయశాంతి తేల్చి చెప్పారు.