వైఎస్‌ షర్మిల ఖమ్మం సభకు కరోనా బెడద

తెలంగాణాలో రాజన్న రాజ్యం తేవడంకోసం అంటూ ఒక కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన కోసమే ఈ నెల 9న ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వైఎస్ షర్మిలకు కరోనా బెడద అడ్డంకులు సృష్టిస్తున్నది. దేశవ్యాప్తంగా కరోనా మరోసారి తీవ్రరూపాయం దాల్చుతున్న సమయంలో పలు రక్షాలు కఠినమైన ఆంక్షలు పెడుతూ ఉండగా, ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు ప్రశ్నార్ధకరంగా మారింది. 
 
జీవో నెంబర్‌ 68, 69 ప్రకారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జ్‌ లక్కీనేని సుధీర్‌కు నోటీసులు అందజేశారు. అయితే నిబంధనల ప్రకారం సభ నిర్వహిస్తామని షర్మిల టీమ్‌ పోలీసులకు చెప్పింది. 9న ఖమ్మంలో వైఎస్‌ షర్మిల నిర్వహించబోతున్న బహిరంగసభకు పోలీసుశాఖ మొదట అనుమతిచ్చింది. 
 
ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో షర్మిల లక్షమందితో తొలిసభ నిర్వహించాలని షర్మిల భావించింది. రాష్ట్రంలో రాజన్న రాజ్యం సాధనే లక్ష్యంగా ఆమె పెట్టబోతున్న కొత్తపార్టీ పేరు, పార్టీ గుర్తు, జెండా, పార్టీ నియమావళి, సిద్ధాంతాలను ఈ సభలోనే ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరిగింది. 
తెలంగాణలో జరిగే తొలిసభకు ఖమ్మం వేదిక అవుతున్న నేపథ్యంలో ఖమ్మంలో సభ నిర్వహణకు గాను అనుమతి కోసం ఆ పార్టీ నేతలు ఖమ్మం నగర పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.