టిఎంసి నేత ఇంట్లో ఈవిఎంలు

యులుబెరియా ఉత్తర్ అసెంబ్లీ నియోజక వర్గం తుల్సిబెరియా గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో నాలుగు ఈవిఎంలను, అదే సంఖ్యలో వివిప్యాట్‌లను అధికారులు మంగళవారం కనుగొన్నారు. 
 
టిఎంసి నాయకుని ఇంటి బయట ఎన్నికల కమిషన్ స్టిక్కర్‌తో ఉన్న వాహనాన్ని మంగళవారం తెల్లవారు జామున గ్రామస్తులు కనుగొనడంతో ఈ విషయం బయటపడింది. గ్రామస్థుల ఆందోళనతో తపన్ సర్కార్ అధికారి అక్కడకు వెళ్లి ఈవిఎంలు, వివిప్యాట్‌లను స్వాధీనం చేసుకున్నారు.
 
అక్కడున్న ఎన్నికల అధికారిని సస్పెండ్ చేశారు. ఆ నాలుగు ఈ విఎంలు ఈరోజు పోలింగ్‌లో ఉపయోగించలేదని, దీనిపై జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక కోరామని అధికారులు చెప్పారు. 
 
అయితే సంబంధిత సెక్టార్ ఆఫీసర్ తాను చాలా ఆలస్యంగా చేరుకోవడంతో పోలింగ్ కేంద్రం మూసివేశారని, సరైన రక్షణ ప్రదేశం లేనందున తన బంధువు ఇంట్లో రాత్రంతా గడిపానని చెప్పాడు. స్థానిక ప్రజల ఆందోళనలతో భారీ ఎత్తున కేంద్ర బలగాలను అక్కడకు పంపారు. ఆ ప్రాంతానికి వెళ్లిన బిడిఒను కూడా జనం ఘెరావ్ చేశారు.