కోవిద్ ఆంక్షలపై పునరాలోచించాలి 

కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు విధిస్తున్న ఆంక్షలపై పునరాలోచించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం ఫడ్నవిస్ కోరారు. ఈ మేరకు థాకరేకు ఆయన లేఖ రాశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతోనూ తిరిగి చర్చించిన తర్వాతే ఆంక్షలు అమలు చేయాలని సూచించారు. 

ఆంక్షల ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా చూడాలని కోరారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సెకెండ్ వేవ్ ప్రభావం బాగా కనిపిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలకు దిగింది. గత ఏడాది ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలోకి తీసుకుని బయట రాష్ట్రాల నుంచి ఉపాథి కోసం వచ్చిన వలస కార్మికులు సైతం గణనీయంగానే మహారాష్ట్ర నుంచి సొంత రాష్ట్రాల బాట పడుతున్నారు.

కాగా, ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న తరుణంలో ఆంక్షల తీవ్రత సరికాదని, దీని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా సామాన్య ప్రజానీకంపై తీవ్రంగా ఉంటుందని బీజేపీ నేతల అభిప్రాయంగా ఉంది.

తాజాగా ముంబైలో అన్ని బీచ్‌లు, గార్డెన్లు, బహిరంగ మైదానాలను ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక వారాంతాల్లో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల వరకూ మూసివేయనున్నుట్టు అధికారులు వెల్లడించారు.