బీజేపీ గెలుపు యంత్రం కాదు.. ప్ర‌జ‌ల్లో ఒక చైత‌న్యం

భారతీయ జ‌న‌తా పార్టీని ఎన్నిక‌ల‌ గెలుపు యంత్రం (పోల్ విన్నింగ్ మిష‌న్) అంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించ‌డంపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కౌంట‌ర్ ఇచ్చారు. బీజేపీ సాధించిన‌ ప్ర‌తిసారి పోలింగ్ విన్నింగ్ మిష‌న్ అంటూ ఎద్దేవా చేసేవాళ్లు, వాళ్లు గెలిస్తే మాత్రం అది త‌మ గొప్ప‌గా చెప్పుకుంటుండం విడ్డూర‌మ‌ని తెలిపారు. 

త‌మ పార్టీని పోలింగ్ విన్నింగ్ మిష‌న్ అంటూ ఎద్దేవా చేసేవాళ్లకు భార‌త రాజ్యాంగంపై అవగాహ‌న లేన‌ట్లేన‌ని ధ్వజమెత్తారు. బీజేపీ పోల్ విన్నింగ్ మిష‌న్ కాద‌ని, ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ఉన్న ఒక చైత‌న్యమ‌ని పేర్కొన్నారు.

బీజేపీ 41వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సందర్భంగా జ‌రిగిన‌ స‌మావేశంలో మాట్లాడిన ప్ర‌ధాని.. కేంద్ర ప్ర‌భుత్వం చేసిన చ‌ట్టాల‌ను ప్ర‌తిప‌క్షాలు వ్య‌తిరేకిస్తుండ‌టంపై కూడా స్పందించారు. కేంద్రం ఏ చ‌ట్టాలు చేసినా.. అవి వ్య‌వ‌సాయ చ‌ట్టాలుగానీ, పౌర‌సత్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంగానీ, కార్మిక చ‌ట్టాలుగానీ వాటిపై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతున్న‌ద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. 

రాజ‌కీయ అస్థిర‌త‌ను సృష్టించ‌డ‌మే ల‌క్ష్యంగా అలాంటి పుకార్ల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు. పౌర‌సత్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం చేస్తే ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా పౌర‌స‌త్వాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ద‌ని ఆరోపిస్తున్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాలు చేస్తే ప్ర‌భుత్వం రైతుల భూముల‌ను లాగేసుకుంటున్న‌ద‌ని ప్ర‌చారం చేస్తున్నారని మండిపడ్డారు.

కార్మిక చ‌ట్టాలను చేస్తే కార్మికుల హ‌క్కుల‌ను కాల‌రాస్తుంద‌ని విమ‌ర్శిస్తారు. కానీ ఆరోప‌ణ‌ల‌న్నీ శుద్ధ అబ‌ద్దాలు. బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఇలాంటి విష‌యాల్లో ప్ర‌జ‌ల‌కు నిజాలు తెలియ‌జేసి చైత‌న్యం చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది అని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.