జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. పరిషత్ ఎన్నికలను నిలిపేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టగానే గంటల వ్యవధిలో అర్ధాంతరంగా ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసిన నీలం సాహ్నికి ఈ తీర్పు ఒక విధంగా  ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. 
 
సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు 4 వారాల సమయం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన మాటలను ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.
ఈ మేరకు ఎస్‌ఇసి నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 15న ఎస్‌ఇసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. విపక్షాలు వేసిన పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
ఎపి ఎస్‌ఇసిగా నీలం సహానీ బాధ్యతలు చేపట్టగానే అప్పట్లో మధ్యలో నిలిచినపోయిన ఎంపిటిసి, జెడ్‌పిటిసి నోటిఫికేషన్‌ను కొనసాగిస్తూ మరో నోటిఫికేషన్‌ జారీ చేశారు. గత నోటిఫికేషన్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, బలవంతపు ఏకగ్రీవాలు ఎక్కువగా అయ్యాయని ఆరోపిస్తూ ప్రతిపక్ష టిడిపి ఎన్నికలను బహిష్కరించింది. 
 
ఈ క్రమంలోనే టిడిపి, బిజెపి, జ‌న‌సేన‌ ఎస్‌ఇసి నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశాయి. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నిక‌ల కోడ్ అమ‌లు సుప్రీంకోర్టు ఇచ్చిన స్ప‌ష్ట‌మైన ఆదేశాల‌ను పిటిష‌న్ల‌లో పేర్కొన్నాయి. ఎస్‌ఇసి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరాయి. 
 
సుప్రీం కోర్టు తీర్పుకు ఎస్‌ఇసి తీరు విరుద్ధమని పేర్కొన్నాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ఎస్‌ఇసిని ఆదేశించింది. దీంతో నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఇసి 45 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. గతంలో నిలిచిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని, ఎన్నికలు సజావుగా సాగేలా ఆదేశాలివ్వాలని కోరింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది.