
ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ సోమవారంతో కీలకమైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. ఆర్క్ పూర్తవడం ఓ మైలురాయిగా నార్తర్న్ రైల్వేస్ అభివర్ణించింది.
ఈ బ్రిడ్జ్ మొత్తం పొడువు 1.3 కిలోమీటర్లు కాగా.. రూ.1486 కోట్ల ఖర్చుతో దీనిని నిర్మిస్తున్నారు. ఉధమ్‌పూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ అతి ఎత్తయిన బ్రిడ్జ్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఇది ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల ఎత్తు ఎక్కువ ఉండటం విశేషం.
కశ్మీర్‌ను మిగిలిన దేశంలో అనుసంధానించడంలో భాగంగా చేపట్టిన యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్ట్‌లో సోమవారం ఓ చారిత్రక మైలురాయిని నార్తర్న్ రైల్వేస్ పూర్తి చేసింది. ప్రాజెక్ట్ మొత్తం రెండున్నరేళ్లలో పూర్తవుతుంది అని నార్తర్న్ రైల్వేస్ జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ తెలిపారు.
ఈ బ్రిడ్జ్ ఆర్క్ నిర్మాణం పూర్తయ్యే ఘట్టాన్ని వీడియో లింక్ ద్వారా రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ చూశారు. రెండు భాగాలుగా ఉన్న ఆర్క్‌ను కలిపే 5.6 మీటర్ల లోహాన్ని సోమవారం కలిపి మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెట్రిక్ టన్నుల ఉక్కు, 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని, 66 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగినట్టు చెప్పారు.
ఆర్చ్ మొత్తం బరువు 10,619 టన్నులని గంగాల్ తెలిపారు. ఇలాంటి నిర్మాణం భారతీయ రైల్వే చరిత్రలో ఇదే తొలిసారని వివరించారు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల నుంచి, అత్యంత తీవ్రతతో సంభవించే భూకంపాల నుంచి ఈ బ్రిడ్జి తట్టుకుంటుందన్నారు. నిర్మాణంలోని వివిధ భాగాలను కలిపేందుకు దాదాపు 584 వెల్డింగ్ వర్క్ జరిగినట్టు చెప్పారు. ఆర్చ్ నిర్మాణంలో అసలైన సవాలు సోమవారంతో ముగిసిందని కొంకణ్ రైల్వే చైర్మన్ సంజయ్ గుప్తా అన్నారు.
More Stories
`కామాఖ్య దేవాలయంలో నరబలి’ కథనంపై ఆగ్రహం
బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే రూ.1000 జరిమానా
ఆస్తి రిజిస్ట్రేషన్ అయినా ఆ భూమి మీది కాదు