ఎల్టీటీఈ తరహాలో మావోయిస్టులపై కేంద్రం ఆపరేషన్

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌ను కేంద్ర హోంశాఖ చాలా సీరియస్‌గా తీసుకుంది. 24 మంది జవాన్లు వీరమరణం పొందడం, 31 మందికి తీవ్ర గాయాలైన నేపథ్యంలో కేంద్రం మావోయిస్టుల అంశంపై సీరియస్‌గానే ఉందని సమాచారం. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అసోం ఎన్నికల ప్రచార సభలో ఉన్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే తన పర్యటనను కుదించుకున్నారు. ఢిల్లీకి చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ పరిస్థితిపై ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర హోంశాఖా కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అర్వింద్ కుమార్‌తో పాటు సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాతే కేంద్ర హోంమంత్రి ఛత్తీస్‌గఢ్‌కు పయనమయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లో కూడా అమిత్‌షా ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మావోయిస్టులను సమూలంగా ఏరివేయాలన్న దృఢమైన నిర్ణయానికి కేంద్ర హోంశాఖ వచ్చింది. ఇదే అంశాన్ని భద్రతా బలగాల ఉన్నతాధికారులకు కూడా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రంగంలోకి దిగారు. 

ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఓ స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎల్టీటీఈని అంతమొందించిన తరహాలోనే మావోయిస్టులను ఏరివేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ జరిగినా కూడా, కేంద్ర బలగాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న దృఢమైన సంకల్పంతోనే అడుగులు వేస్తున్నాయి. 

ఇప్పటికే దండకారణ్యాన్ని అన్ని వైపులా భద్రతా బలగాలు చుట్టిముట్టాయి. మావోయిస్టులను సమూలంగా ఏరివేయాలన్న లక్ష్యంతోనే రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.