మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ.. వారాంతాల్లో లాక్‌డౌన్‌

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో భాగంగా మహారాష్ట్రలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు, కరోనా నిబంధనలను పాటింపజేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తోంది. 

ఈ క్రమంలోనే రాష్ట్రంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు వంటి కఠిన ఆంక్షలు విధించింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అంతేకాదు, వారాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించింది. 

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో ఆదివారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరిగింది. కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం కఠిన ఆంక్షలతో కూడిన మార్గదర్శకాలు విడుదల చేశారు. సోమవారం నుంచి ప్రతి రోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. లాక్‌డౌన్‌ వచ్చే వారాంతం నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉండనుంది.

 50 శాతం సిబ్బందితోనే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది. కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో హోటళ్లు, మాల్స్‌, బార్లు మూతపడనున్నాయి. వారాంతరాల్లో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తారు. పగటి పూట ఐదుగురు మించి గుమిగూడి ఉండకూడదు.

థియేటర్లు, పార్కులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు మూసివేస్తారు. కేవలం టేక్‌అవే, ఫుడ్‌, నిత్యవసరాల డెలివరీని మాత్రమే అనుమతిస్తారు. ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. సినిమా షూటింగ్‌లను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు.