‘సెకెండ్ వేవ్’ తారాస్థాయిలో ఉండొచ్చు 

సెకెండ్ వేవ్ ఈ నెలలో తారాస్థాయిలో ఉండొచ్చని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా  హెచ్చరించారు. కోరనా వ్యాప్తిని నిరోధించేందుకు మినీ లాక్‌డౌన్‌ల అవసరం ఉందని, వీలైనంత వరకూ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు.

కరోనా కేసులు గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన ఒక సందేశంలో పేర్కొన్నారు. కోవిడ్-19 మేనేజిమెంట్ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా కూడా గులేరియా ఉన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు మాస్క్‌లు ధరించడం లేదని, సామాజిక దూరం పాటించడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.

కరోనా తొలి వేవ్‌లో 70,000 మార్క్ చేరడానికి చాలా నెలలు పట్టిందని, ఈసారి తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ పరిస్థితి కనబడుతోందని డాక్టర్ గులేరియా చెప్పారు. దేశంలో అవసరమైన చోట్ల మినీ లాక్‌డౌన్లు విధించాల్సి ఉంటుందని, సాధ్యమైనంత వరకూ విమాన ప్రయాణాలతో పాటు, రోడ్డు, రైలు ప్రయాణాలకు కూడా ప్రజలు దూరంగా ఉండటం మంచిదని ఆయన సూచించారు.

ఇలా ఉండగా, ఇప్పటివరకూ దేశంలో దాదాపు 7.5 కోట్ల టీకాలు ప్రజలకు అందాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. వీటిలో 6.5 కోట్లు తొలి డోసులు కాగా.. మిగిలినవి రెండో డోసు అని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. మూడో విడత టీకా కార్యక్రమంలో భాగంగా 45 ఏళ్లకు పైబడిన 8 లక్షల మంది టీకా తీసుకున్నారని పేర్కొంది. 
 
ఇప్పటివరకూ ఇచ్చిన మొత్తం టీకా డోసుల్లో 60 శాతం వాటా ఎనిమిది రాష్ట్రాలదని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా.. ఇందులో మహారాష్ట్ర వాటా 9.68 శాతమని తెలిపింది. ఇక కొత్తగా దేశంలో 93249 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటిలో 80.96 కేసులు  మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలో వెలుగు చూశాయి.