ఉత్తరాఖండ్ అడవుల్లో భారీ దావానలం, నలుగురు మృతి

ఉత్తరాఖండ్ అడవుల్లో భారీ దావానలం చెలరేగింది. మంటలు వేగంగా విస్తరించి అగ్నీకీలలు  ఎగసిపడటంతో 12,000 మంది గార్డులు, అటవీ శాఖ ఫైర్ వాచర్లను హుటాహుటిన రంగంలోకి దించారు. మంటలు అదుపు చేసేందుకు వీరంతా శక్తియుక్తులు ఒడ్డుతున్నారు. 
 
సుమారు 62హెక్టార్ల అటవీ ప్రాంతంలో సంభవించిన మంటల కారణంగా గత 24 గంటల్లో ఈ దావానలం బారిన పడి నలుగురు మృతి చెందగా, ఏడు జంతువులు మంటల్లో ఆహుతయ్యాయని, రూ.37 లక్షల విలువైన ఆస్తి బూడిదైందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ తెలిపారు. 62 హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. 
 
ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ అత్యవసర సమవేశం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపుతూ కేంద్రం ఆదేశాలిచ్చింది. ఒక హెలికాప్టర్‌ను కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అందుబాటులో ఉంచేందుకు ఆదేశాలిచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు.
 
ఉత్తరా కాశిలోని వరుణవత్ పర్వతంపై మంటలు, గర్హ్వాల్ చౌరేస్ అగ్ని కీలలు శ్రీనగర్ చేరుకున్న తరువాత హెచ్చరికలు జారీచేశారు. నైనిటాల్‌లో 20 అడవులు కూడా తీవ్ర మంటల్లో ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో డిసెంబర్ నుంచి అడవులు అగ్రికి ఆహుతవుతున్నాయి.

ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, నవంబర్-జనవరి మధ్య ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా అడవి మంటలు సంభవించాయి. నవంబర్-జనవరి వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో 2,984 అడవి మంటలు సంభవించాయి. వీటిలో 470 ఉత్తరాఖండ్‌లోనే ఉన్నాయి.

గత శీతాకాలంలో 39 సంఘటనలు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 27 వరకు ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో 787 అగ్ని ప్రమాదాలు జరిగాయని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ మన్ సింగ్ తెలిపారు. మార్చి 27 తరువాత, అగ్ని ప్రమాదం క్రమంగా పెరిగింది. ఇప్పటివరకు దాదాపు 1,299 హెక్టార్ల అటవీ భూములు మంటల్లో చిక్కుకున్నాయి.