ఇస్రో శాస్త్రవేత్త వేధింపులపై `సుప్రీం’ ప్యానల్ నివేదిక 

గూఢచర్యం కేసులో ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ నంబి నారాయణన్‌ అరెస్ట్‌పై దర్యాప్తు బృందం తన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. విపరీతమైన వేధింపులు, అపారమైన వేదన కలిగించిన పోలీసులపై చర్యలు తీసుకోవడానికి నివేదిక అందించాలని సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి దర్యాప్తు ప్యానెల్‌ను 2018 సెప్టెంబర్‌ 14న నియమించింది.

ముగ్గురు సభ్యులున్న ఈ ప్యానెల్‌కు మాజీ న్యాయమూర్తి డీకే జైన్‌ నాయకత్వం వహించారు. ఈ బృందం తమ నివేదికను శనివారం నాడు సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.
నారాయణన్‌ను చెప్పలేనంత అవమానానికి గురిచేసినందుకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఇదివరకే సుప్రీంకోర్టు ఆదేశించింది.

కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ అరెస్టు జరిగింది. శాస్త్రవేత్త అరెస్ట్‌, అవమానం, ఆవేదన కలిగించిన ఈ సంఘటనపై లోతైన దర్యాప్తు జరిపిన తర్వాత ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ తమ నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు సమర్పించింది. 

నారాయణన్ అక్రమ అరెస్టుకు కేరళలోని అప్పటి ఉన్నతాధికారులు కారణమని సీబీఐ తన దర్యాప్తులో కూడా పేర్కొన్నది. కాంగ్రెస్‌లోని ఒక విభాగం అప్పటి ముఖ్యమంత్రి దివంగత కే కరుణకరన్‌ను లక్ష్యంగా చేసుకుని నారాయణన్‌ అరెస్ట్‌ జరిపింది చివరికి ఆయన రాజీనామాకు దారితీసేలా చేయగలిగిన్నట్లు కధనాలు వెలువడ్డాయి.

దాదాపు రెండున్నర సంవత్సరాల కాలంలో జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలోని ప్యానెల్.. నంబి నారాయణన్‌ అరెస్టుకు దారితీసిన పరిస్థితులను పరిశీలించింది. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను ఇద్దరు శాస్త్రవేత్తలతోపాటు ఇద్దరు మాల్దీవుల మహిళలు, మరో నలుగురు కలిసి విదేశాలకు బదిలీ చేశారని ప్రధాన ఆరోపణ. ఈ కేసులో 79 ఏండ్ల వయసున్న మాజీ శాస్త్రవేత్తకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. కేరళ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నారాయణన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అప్పటి సిట్ దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించిన మాజీ డీజీపీ సీబీ మాథ్యూస్, ఇద్దరు రిటైర్డ్ పోలీసు సూపరింటెండెంట్లు కేకే జాషువా, ఎస్ విజయన్, అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ ఆర్బీ శ్రీకుమార్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారని నంబి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తరువాతి రోజుల్లో వీరందరిని సీబీఐ బాధ్యులుగా గుర్తించింది.

దాంతో ఈ విషయంలో లోదైన దర్యాప్తు జరిపి నిజానిజాలు బయటకు తీసేందుకు ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. త్వరలో ఈ కమిటీ సమర్పించిన నివేదికను తెరిచి చూసి చదివిన తర్వాత మరోసారి విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి.