విధుల నుంచి ప్రొఫెసర్ జీఎన్‌ సాయిబాబ తొలగింపు

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్‌ లాల్‌ ఆనంద్‌ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబను కాలేజీ విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో సాయిబాబ ప్రస్తుతం నాగపూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. 

సాయిబాబా తొలగింపు మార్చి 31వ తేదీ మధ్యాహ్నం నుంచి తక్షణమే అమల్లోకి వచ్చిందని తెలిపే మెమొరాండంను ఆయన భార్య వసంత అందుకుంది. మూడు నెలల జీతాన్ని సాయిబాబా బ్యాంకు ఖాతాలో జమచేసినట్లుగా అందులో తెలిపారు.

మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై రామ్‌ లాల్‌ ఆనంద్‌ కాలేజీలో ఇంగ్లీష్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసే సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు 2014లో అరెస్టు చేశారు. అరెస్టుతో ఆయనను కాలేజీ విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. అప్పటి నుండి సగం జీతమే కుటుంబం అందుకుంటూ వస్తుంది.

అయితే తాజాగా సాయిబాబాను విధుల నుండి శాశ్వతంగా తీసివేస్తూ కాలేజీ నిర్ణయం వెలువరించింది. ఇది ఉద్యోగి హక్కులను కాలరాయడమేనని దీనిపై తాము కోర్టును ఆశ్రయించనున్నట్లు సాయిబాబ భార్య వసంత తెలిపింది. తీర్పు ఇంకా బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు.