మావోయిస్టుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి 

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కాల్పుల మోతలతో దద్దరిల్లింది. బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు మెరుపుదాడి జరపడంతో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. 

అయితే ఎన్‌కౌంటర్‌ తర్వాత సుమారు 15 మంది జవాన్లు కనిపించకుండా పోయారని ఛత్తీస్‌గఢ్‌ పోలీసు వర్గాలు తెలిపాయి. సుమారు పది మంది మావోయిస్టులు సహితం మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. 

మావోయిస్టులు, భద్రతా బలగాల హోరాహోరీ తర్వాత రీఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, ఇద్దరు మృతదేహాలు లభించాయని వెల్లడించారు. గాయపడినవారిలో 23 మంది జవాన్లను జీజాపూర్‌ దవాఖానకు, మరో ఏడుగురిని రాయ్‌పూర్‌ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. సుమారు 15 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, సీఆర్‌పీఎఎఫ్‌, కోబ్రా భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో సుమారు 2 వేల మంది జవాన్లు పాల్గొన్నారు. బృందాలుగా విడిపోయి మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. 

 బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ పట్టిలింగం కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం బీజాపూర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాలను డీఆర్జీ, ఎస్టీఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, కోబ్రా ప్రత్యేక బలగాలు జల్లెడపడుతున్నా యి. తెర్రం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ జరిపిన 760 మంది జవాన్లకు 250 మంది మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు మొదలయ్యాయి.

ఈ ఘటనలో కోబ్రా దళానికి చెంది న ఒక జవాను, బస్తరీయ్‌(ఎస్టీఎఫ్‌) విభాగానికి చెం దిన ఇద్దరు, డీఆర్జీకి చెందిన మరో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. 28 మంది గాయపడ్డారు. మారుమూల ప్రాంతం కావడంతో వారిని ఆస్పత్రికి తరలించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సిల్గేరీ అటవీ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌లో ఉన్న జవాన్లపై మావోయిస్టుల గెరిల్లాసైన్యానికి (పీఎల్‌జీఏ) చెందిన నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు. ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డీఆర్‌జీకి చెందిన నలుగురు జవాన్లు, కోబ్రా బెటాలియన్‌కి చెందిన ఒక జవాన్‌ మృతిచెందారు.

అయితే కాల్పుల్లో మరికొంత మంది మావోయిస్టులు చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒక మహిళా మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో గాలిస్తున్నారు.  మార్చ్‌ 23న కూడా ఇలాంటి దాడి జరిగి ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

భారత వాయు సేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఏడుగురు క్షతగాత్రులను రాయ్‌పూర్‌ ప్రభుత్వాస్పత్రికి, మరో 21 మం దిని బీజాపూర్‌ దవాఖానాకు తరలించారు. నక్సల్స్‌ వైపు 9 మంది మృతిచెంది ఉంటారని ఐజీ వెల్లడించారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని  పేర్కొన్నారు. ఒక మహిళా నక్సల్‌ మృతదేహం లభ్యమైందని తెలిపారు. జవాన్ల మృతిపట్ల ఛత్తీ‌సగఢ్‌ సీఎం భూపేశ్‌ బగేల్‌, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.