మమతాజీ వారణాసి రండి.. మోదీ స్వాగతం 

బయటి వ్యక్తి అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. బయటివ్యక్తులు అంటూ వ్యాఖ్యానిస్తూ టీఎంసీ నేతలు నేతాజీని అవమానపరుస్తున్నారని మోదీ దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్య భారతదేశంలో ఇక్కడి పౌరులెవ్వరూ బయటి వ్యక్తులు కారని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా తన నియోజకవర్గమైన వారణాసికి మమతా బెనర్జీని ఆహ్వానించారు. అయితే, అక్కడ రామభక్తులు అడుగడుగునా కనిపిస్తారని, అప్పుడేం చేస్తారంటూ చురకలంటించారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అభద్రత కారణంగా నందిగ్రామ్ సీటు నుంచి కాకుండా మరో సీటు నుంచి పోరాడేందుకు మమతా బెనర్జీ సిద్ధమయ్యారని ప్రధాని మోదీ చేసిన విమర్శలపై.. మమతా బెనర్జీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తారని తృణమూల్ కాంగ్రెస్‌ తెలిపింది. 

లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. ‘దీదీ ఇప్పుడు బయట స్థలం కోసం చూస్తున్నారు. వారణాసికి స్వాగతం. హల్దియా నుంచి వారణాసికి వెళ్ళే ఓడ ఉంటుంది’ అంటూ మోదీ చెప్పారు. `మరో విషయం, బెనారస్‌ ప్రజలు చాలా సహృదయంతో ఉన్నారు. వారు మిమ్మల్ని పర్యాటకులని లేదా బయటి వ్యక్తి అని పిలువరు. వారు బెంగాల్ ప్రజల మాదిరిగానే పెద్ద మనుసుతో ఉన్నారు’ అని కూడా తెలిపారు.

`అయితే, వారణాసిలో జై శ్రీ రామ్ అని చెప్పే చాలా మంది ఎదురవుతుంటారు. అప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసా? మీకు ఎవరిపై కోపం వస్తుందో తెలుసా? బెనారస్ ప్రజలపై కోపగించవద్దు. వారు మీతో కలిసి నివసిస్తారు. కాని వారు మిమ్మల్ని ఢిల్లీకి వెళ్లనివ్వరు. వారు మిమ్మల్ని అక్కడే ఉంచుకుంటారు’ అని పేర్కొన్నారు. 

నరేంద్ర మోదీ జై శ్రీరాం అని పెద్ద ఎత్తున నినాదాలు చేయిస్తూ బహిరంగ సభలో ఈ విధంగా చెప్పడంతో అక్కడికి వచ్చిన వారిని విశేషంగా ఆకర్శించింది. మోదీ ప్రసంగం చేస్తున్నంత సేపు అక్కడ గుమిగూడిన కార్యకర్తలు జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేయడమే ముఖ్యమంత్రి మమత అతిపెద్ద తప్పిదమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒకవేళ ఆమె అక్కడ ఓడిపోతే టీఎంసీ పార్టీని నడపడం కూడా కష్టమేనని ఆయన ఎద్దేవా చేశారు.