యడ్యూరప్ప రాజీనామా ప్రసక్తే లేదు

కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప రాజీనామా చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర సీనియర్ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప స్పష్టం చేశారు. తాను గవర్నర్‌కు లేఖ రాయడం కేవలం అధికార నిర్వహణ సంబంధిత విషయం అని తెలిపారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈశ్వరప్ప వ్యవహరిస్తున్నారు. 

ముఖ్యమంత్రి తరచూ తమ విభాగపు పనులలో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని గవర్నర్‌కు ఈశ్వరప్ప ఫిర్యాదు చేశారు. ఈ లేఖను ప్రస్తావిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయిన సిద్ధరామయ్య యడ్యూరప్ప రాజీనామాకు డిమాండ్ చేశారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని కోరారు. 

ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రి ఈశ్వరప్ప స్పందిస్తూ సిద్ధరామయ్య అత్యవసరంగా తిరిగి సిఎం కావాలనే ఆత్రుత తలెత్తినట్లుందని ఎద్దేవా చేశారు.  ప్రజా తిరస్కారానికి గురైన వ్యక్తికి ఈ తొందరేమిటో అని ప్రశ్నించారు.

యడ్యూరప్ప రాజీనామా చేస్తే వెంటనే సిఎం అయిపొవచ్చు అనుకుంటున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. గవర్నర్‌కు తన లేఖ వ్యక్తిగతం,  అంతేకాకుండా ఇది పరిపాలన వ్యవహారం అని పేర్కొంటూ సిఎం రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.