ఆంధ్ర ప్రదేశ్ లో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రతి ఎమ్మెల్యే ఓ గుండాలా మాట్లాడుతున్నారు.. మీరు ఎమ్మెల్యేలా? గుండాలా.?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన రోడ్ షో నిర్వహించి, అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని ఈ సందర్భంగా పవన్ విజ్ఞప్తి చేశారు.
‘‘వైసీపీ ఎమ్మెల్యేల బెదిరింపులు, గూండాగిరీ ఎక్కువ అయిపోతోంది. శాంతిభద్రతలు ఏస్థాయిలో దిగజారిపోయాయంటే వైఎస్ వివేకానంద హత్యకు గురైతే ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదు. కోడికత్తి కేసుకు కూడా వదిలేశారు. చిన్నాన్న హత్య కేసు నిందితులను పట్టుకుని సోదరికి న్యాయం చేయని జగన్ రాష్ట్రానికి ఏమిచేస్తాడు?’ అని పవన్ ప్రశ్నించారు.
151 మంది ఎమ్మెల్యేలు గుండాగిరి చేస్తున్నారని మంది పడ్డారు. చాలా ఆలోచించే రాజకీయాల్లోకి వచ్ఛానని పేర్కొంటూ తల తెగిపోవాలి తప్ప.. వెనకడుగు పడదని స్పష్టం చేశారు. అన్నమయ్య, వేమారెడ్డి, కృష్ణదేవరాయలు నడయాడిన నేల ఇది (రాయలసీమ). ఒక్కొక్కరూ ఒక్కో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలా పోరాడాలని పిలుపిచ్చారు.
‘సినిమాలలోకి వెళ్లానంటూ నన్ను విమర్శిస్తున్న వారిలా నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పేకాట క్లబ్బులు లేవు. రాజకీయ నాయకులకు డబ్బులు ఎలా వస్తాయి? వైసీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓటుకు రూ.2000 ఎక్కడి నుంచి వస్తున్నాయి?’ అంటూ రాజకీయ ప్రత్యర్థులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
“సినిమాలు మానేసి అడ్డదారులు తొక్కను. అన్యాయమైన సంపద మాకొద్దు. పిడికెడు రాగి సంగటి తింటా కానీ… అడ్డదారులు తొక్కను’’ అంటూ ఉద్వేగంగా చెప్పారు. ‘‘ఓ సంకల్పం తీసుకుందాం. వచ్చే రోజుల్లో ఏపీ దశా-దిశా మారాలి. వేలకోట్ల రాజకీయ విధానం మారాలి. 40 ఏళ్ల సివిల్ సర్వీసులో ఉన్న విశిష్టమైన వ్యక్తి రత్నప్రభ. మానవహక్కుల కోసం పని చేశారు. ఏపీ ఐటీ హబ్‌గా ఉందంటే… రోడ్ మ్యాప్ వేసింది రత్నప్రభే” అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. ఒకవేళ వైసీపీ ఎంపీ గెలిస్తే… ఏం చేయగలరో చెప్పండి. గెలిచినా ఆయన ఏం మాట్లాడలేరు? పార్టీ కంట్రోల్‌లో ఉంటారు. రత్నప్రభ గెలిస్తే.. మన సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. ‘అధికారం కోసం అర్రులుచాచే వ్యక్తిని కాదు నేను. మీ గుండెల్లో స్థానం సుస్థిరం చేసుకున్నా. మీకు సేవచేసుకునే భాగ్యం వస్తే అందరికంటే ఎక్కువ సేవచేయగలను. వచ్చినా రాకపోయినా మీకోసం కడవరకు సేవచేస్తా’ అంటూ భరోసా ఇచ్చారు.
అధికార బదలాయింపు జరగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. “నేను ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా. కంపెనీ ప్రొడక్టులకు కాదు ఇది హిందూ దేశం. అన్ని మతాలను కలుపుకొనివెళ్లే దేశం. 1999లో బీజేపీ గెలిచిన సీటు ఇది. మన తిరుపతి హిందువులకు ప్రత్యేకమైనది. ఇలాంటిచోట జాతీయస్థాయి నాయకత్వం కావాలి” అంటూ పిలుపిచ్చారు.
సీఎం పదవిపై తాను ఎప్పుడూ ఆలోచించలేదని చెబుతూ “ఏడు కొండలవాడి సాక్షిగా చెబుతున్నాను. సీఎం పదవి వస్తే… అందరికంటే ఎక్కువ సేవ చేయగలను. దానికోసం అర్రులు చాచలేదు’’ అని స్పష్టం చేశారు.
తమ్ముడు పవన్ కల్యాణ్ మద్దతు తనకుందని, ఉపఎన్నికలో గెలిపిస్తాడని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన, బీజేపీ నిర్వహించిన జనగర్జన సభలో ఆమె ఎర్రకండువాతో పవన్‌కు రాఖీ కట్టారు. రావటం ఆలశ్యం అవుతుందేమో గానీ, రావటం మాత్రం పక్కా అనే పవన్ డైలాగ్‌ను చెప్పి రత్నప్రభ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
‘‘తిరుపతి నుంచి బీజేపీ విజయయాత్ర ప్రారంభమవుతుంది. ఐ.ఎ.ఎస్ అధికారిగా అభివృద్ధి చేశాను. ఇప్పుడున్న ప్రభుత్వం అప్పులు రెండు లక్షల కోట్లు అప్పు చేసింది. రెండు సంవత్సరాలుగా బడ్జెట్ పెట్టడం లేదు. ఖజానా లేదు, అందుకే బడ్జెట్ పెట్టడం లేదు. పరిశ్రమలు రావటం లేదు. ఉద్యోగాలు రావటం లేదు. నిరుద్యోగం పెరిగిపోతోంది. మాకు ఓటు వేస్తే ఏపీకి కొత్తదారి చూపిస్తాం.’’ అని ఆమె భరోసా ఇచ్చారు.
More Stories
ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తాం
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
ఒకేరోజు 13,326 గ్రామసభలతో ఏపీ ప్రపంచ రికార్డు