సునీల్‌ నాయక్‌ మృతికి సీఎం కేసీఆర్‌ దే బాధ్యత

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్‌ నాయక్‌ మృతికి సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ‘బంగారు తెలంగాణ అన్నావ్‌.. బలి తెలంగాణను చేశావ్‌’ అని ఘాటుగా విమర్శించారు. 

శుక్రవారం రాత్రి సునీల్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మహబూబాబాద్‌ జిల్లాకు వెళ్తున్న సంజయ్‌ని భూపాలపల్లిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ  సునీల్‌నాయక్‌ మృతదేహానికి గన్‌పార్కు వద్ద నివాళులర్పించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం నిరాకరించడం దారుణమని మండిపడ్డారు.

సునీల్‌ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌ రూ.లక్ష సహాయం ప్రకటించటం సిగ్గుచేటని విమర్శించారు. సునీల్‌ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియాతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్కు  ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉదయం గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద సునీల్‌ కుటుంబ సభ్యుల్ని సంజయ్‌ పరామర్శించారు. సునీల్‌ ఆత్మహత్య.. నిరుద్యోగుల పట్ల టీఆర్‌ఎస్‌ సర్కారు అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. 

ఉద్యమ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి, వారి చావులకు కారణమైన కేసీఆర్‌అండ్‌కో.. ఇప్పుడు ఉద్యోగాలివ్వకుండా మళ్లీ వారి చావులకు కారణమవుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ నిరుద్యోగుల హక్కుల సాధనకు అవసరమైతే బలిదానానికీ సిద్ధమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. 

సునీల్‌ నాయక్‌ మృతితో వరంగల్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పలు సంఘాల నేతలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి ఇంటిని ముట్టడించారు. కేయూ, ఓయూలో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.   

సునీల్‌ నాయక్‌ మృతదేహాన్ని గురువారం రాత్రి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. శుక్రవారం ఉదయం 11.45 గంటల సమయంలోపోస్టుమార్టం పూర్తి చేసి, మృతదేహాన్ని అంబులెన్స్‌లో సునీల్‌ స్వగ్రామానికి తరలించారు. సమాచారం తెలుసుకున్న బీజేవైఎం, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఓయూ విద్యార్థి నేతలు, లంబాడీ హక్కుల సంఘం నాయకులు, షర్మిల పార్టీ నేత ఇందిరాశోభన్‌ మార్చురీ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది.