మహబూబాబాద్‌లో బండి సంజయ్ అరెస్ట్

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సునీల్ నాయక్ అంత్యక్రియలకు వెళ్తుండగా ఆయనను అడ్డుఉన్న పోలీసులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు. నర్సంపేట వద్ద బండి సంజయ్‌ని అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మాట తప్పడంతోనే సునీల్ ఆత్మహత్య చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. నిరుద్యోగ భృతి కోసం కలెక్టరేట్లను ముట్టడిస్తే అక్రమ అరెస్ట్‌లు చేశారని ఆయన ధ్వజమెత్తారు.

కమ్యూనిటీ, ఇంటికి నీళ్లు, నిధులు, నియామకాలు విడుదల చేసింది కేంద్రమేనని బండి సంజయ్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం లేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన బొడ్డు సునీల్ అనే యువకుడు శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు.

సునీల్ నాయక్‌ మృతదేహం రామ్‌ సింగ్‌ తండా చేరుకోగానే  అంబులెన్స్ ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించారు. సునీల్ కుటుంబానికి న్యాయం జరగాలని స్థానికుల నిరసనకు దిగారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. సునీల్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే బండి సంజయ్ సునీల్ నాయక్ అంత్యక్రియలకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ జిల్లా గూడూరు మండలం గుండెంగ సోమ్లా తండాకు చెందిన సునీల్ విద్యార్థులు, నిరుద్యోగ సమస్యలపై పోరాడేవాడు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఆరేళ్లు దాటినా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో సునీల్ మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలోనే మార్చి 26వ తేదీన కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో పురుగుల మందు తాగేశాడు. సునీల్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియోను రికార్డు చేశాడు.

ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సినోడిని ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. విద్యార్ధులు ముఖ్యమంత్రిని విడిచిపెట్టొద్దని చెప్పాడు. తెలంగాణ వచ్చి ఏడేళ్లైనా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారని, వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియచేసేందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు.