యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ పాపాల చిట్టాలు విప్పిన ప్రధాని 

కేరళలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్), లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) పాపాల చిట్టాలను ప్రధాని నరేంద్ర మోదీ ఏకరువు పెట్టారు. వారసత్వ పాలనతో సహా 7 పాపాలకు ఒడిగట్టారని విమర్శించారు. 
 
శుక్రవారం పదనాంతిట్ట వద్ద రిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, సంపద సృష్టి కోసం వారసత్వ పాలనను ప్రోత్సహించారని, ఓటు బ్యాంకు రాజకీయాలకు అగ్రపీఠం వేశారని, దీంతో సహజంగానే ప్రభుత్వం వెనుకబాట పట్టిందని, పాలనలో అచేతనత్వం ఆవరించిందని ధ్వజమెత్తారు. ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్న కూటముల నుంచి కేరళకు విముక్తి కలిగించాల్సిన తరుణం ఆసన్నమైందని పిలుపిచ్చారు. వారసత్వ పాలన కోసం ఈ రెండు కూటములు అన్నింటినీ పక్కనపెట్టాయని విమర్శించారు.
ఎల్‌డీఎఫ్ అగ్రనేత కుమారుడి విషయం అందరికీ తెలిసిందేనని, ప్రత్యేకించి వివరించాల్సిన పని లేదని ఎద్దేవా చేశారు. తమను ఎవరూ ఓడించలేరనే అహంకారంతో ఉన్న ఆ రెండు కూటములు తమ మూలాలను విస్మరించాయని ఆరోపించారు. ‘డబ్బుపై అత్యాశ, సోలార్ కుంభకోణం, డాలర్ స్కామ్, భూ కుంభకోణం, గోల్డ్ స్కామ్, లంచం స్కామ్, ఎక్సైజ్ స్కామ్… ఇలా ఈ జాబితాకు అంతం లేదు. ప్రతి రంగాన్ని వీళ్లు కొల్లగొట్టారు’ అని మోదీ ఆరోపించారు. 
 
శబరిమల ఆలయం వద్ద భక్తుల నిరసనలను ప్రస్తావిస్తూ, భక్తులపై ఎందుకు లాఠీలు ఝళిపించారో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. అమాయక భక్తులు, సొంత పౌరులపై పదేపదే దాడులు జరిపారని విమర్శించారు. కేరళను ప్రగతిపథం వైపు పరుగులు తీయించే అభివృద్ధి ఎజెండాతో ఎన్డీయే ప్రజల ముందుకు వచ్చిందని చెప్పారు.
 
 కాగా,మహిళలకు గౌరవం, భద్రతను కాంగ్రెస్, డీఎంకేకు కల్పించలేవని ప్రధాని నరేంద్ర మోదీ అంతకు ముందు. మదురైలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు.  నారీ శక్తి ప్రాధాన్యత గురించి మదురై ఎన్నో పాటలు చెప్పిందని పేర్కొంటూ మహిళలను ఏవిధంగా గౌరవించాలో, ఏవిధంగా ఆరాధించాలో ఇక్కడ చూడవచ్చని తెలిపారు. 
 
డీఎంకే కానీ , కాంగ్రెస్ కానీ ఎప్పుడూ మహిళలను గౌరవించడం, భద్రత కల్పించడం చేయవని, డీఎంకే ఫస్ట్ ఫ్యామిలీలోని కలహాల కారణంగా శాంతిని ప్రేమించే మదురైను మాఫియాకు ఆలవాలం చేసే ప్రయత్నాలు చేస్తాయని హెచ్చరించారు. ఆ పార్టీ నేతలు పదేపదే మహిళలను కించపరుస్తుంటారని ధ్వజమెత్తారు.
 
మదురై ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారని, రాజకీయ పార్టీల గుణగణాలను గుర్తించి అభివృద్ధికి భరోసా ఇస్తున్న ఎన్డీయేకు ఓటు వేస్తారనే నమ్మకం తనకు ఉందని ప్రధాని చెప్పారు. టెక్స్‌టైల్ రంగంలో మరింత యాంత్రీకరణ, రుణ సౌలభ్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 
ఈ ఏడాది బడ్జెట్‌లో మెగా-ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్ పథకం ‘మిత్ర’ను ప్రకటించామని గుర్తు చేశారు. రాబోయే మూడేళ్లలో ఏడు టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.