మమతాది 3టీ మోడల్.. మోదీది 3వీ మోడల్‌

బెంగాల్‌లో మ‌మ‌తా బెనర్జి నడుపుతున్న‌ది 3టీ మోడల్ ప్ర‌భుత్వ‌మ‌ని  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. శుక్రవారం కూచ్‌బిహార్‌లో ఓ ప్ర‌చార స‌భ‌లో మాట్లాడుతూ  మూడు టీలు అంటే తానాషాహి (నియంతృత్వం), టోలాబాజీ (డబ్బులు గుంజడం), తుష్టీకరణ్ (సంతుష్టీకరణ) అని ఆయ‌న చెప్పారు.

కానీ, కేంద్రంలో త‌మ ప్రభుత్వం మాత్రం 3వీ మోడల్‌ను అనుసరిస్తున్న‌దని పేర్కొ‌న్నారు. ఈ మూడు వీ ల అర్థం వికాస్ (అభివృద్ధి), విశ్వాస్ (నమ్మకం), వ్యాపార్ (వ్యాపారం) అని షా చెప్పారు. ఇప్పటికే రెండు దశలలో 60 నియోజకవర్గాలలో ముగిసిన పోలింగ్ లో బిజెపి 50 సీట్లు గెల్చుకున్నట్లే అని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్ లోని 54 సీట్లలో ఒక్క సీట్ ను కూడా మమతకు ఇవ్వవద్దని, ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి కోసం ప్రధాని మోదీ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన పిలుపిచ్చారు.

అదేవిధంగా నందిగ్రామ్‌లో మమతాబెనర్జి ఓటమి ఖరారైపోయిందని అమిత్ షా స్పష్టం చేశారు. ‘ఓటమి ఖరారవడంతో మమత సలహాదారు ఆమెకు మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా పోటీ చేయ‌మ‌ని సూచించార‌ని ఎద్దేవా చేశారు. అందుకు ఆమె బదులిస్తూ, ఉత్తర బెంగాల్ ప్రజలు తనను గెలవనివ్వరని, వేరే ప్రాంతంలోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారని తెలిపారు. మ‌మ‌త హ‌యాంలో ఉత్తర బెంగాల్‌లో రాజకీయ హింస విప‌రీతంగా పెరిగిపోయింద‌ని, ఆ రాజ‌కీయ హింస‌కు ముగింపు పలకడం కోసం ప్రధానికి ఒక అవకాశం ఇవ్వాలని అమిత్ షా ఓటర్లను కోరారు.

నందిగ్రామ్ నుండి ఆమె ఓట‌మి ఖాయ‌మ‌ని.. మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచి దీదీ పోటీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంద‌ని ప్ర‌ధాని మోదీ సహితం గురువారం ఎద్దేవా చేశారు. ఉలుబేరియాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న ప్ర‌ధాని తొలుత నందీగ్రామ్‌కు వెళ్లారు, అక్క‌డ ప్ర‌జ‌లు స‌మాధానం ఇచ్చార‌ని, మీరు ఇంకెక్క‌డికి వెళ్లానా, సమాధానం ఇచ్చేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని స్పష్టం చేశారు.
బెంగాల్ సంస్కృతిని మ‌మ‌తా బెన‌ర్జీ అవ‌మానిస్తున్నార‌ని, బంగ్లాదేశ్‌లో ఆల‌యానికి వెళ్తే దాన్ని ఆమె త‌ప్పుప‌ట్టార‌ని ప్రధాని ధ్వజమెత్తారు. కాళీ మాత ఆల‌యంలో తాను పూజ‌లు చేయ‌డాన్ని దీదీ వ్య‌తిరేకించిన‌ట్లు తెలిపారు. మ‌త విశ్వాసాల‌ను అవ‌స‌రానికి త‌గిన‌ట్లు వాడ‌మ‌ని, మ‌న న‌మ్మ‌కాల‌ను, సాంప్ర‌దాయాలను గ‌ర్వంగా భావిస్తామ‌ని ప్ర‌ధాని స్పష్టం చేశారు.