బీజేపీ డైమండ్ హార్బర్ అభ్యర్థిపై దాడి

బీజేపీ డైమండ్ హార్బర్ అభ్యర్థిపై దాడి
పశ్చిమబెంగాల్‌లో రాజకీయ పోరు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతోంది. గురవారంనాడు వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో బీజేపీ కేష్‌పూర్ అభ్యర్థి కారుపై దాడి జరగగా, శుక్రవారంనాడు బీజేపీ డైమండ్ హార్బర్ అభ్యర్థి దీపక్ హల్దార్, ఆయన మద్దతుదారులపై దాడి జరిగింది. 
 
సౌత్ 24 పరిగణాల ప్రాంతంలోని హరిదేవ్‌పూర్లో ఎన్నికల ప్రచారం జరుతుండగా ఈ దాడి చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి ఒక వర్గం వాళ్లు హల్దార్, అతని మద్దతుదారులపై కర్రలతో దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. దీపక్ హల్దార్‌ను చికిత్స నిమిత్తం డైమండ్ హార్బర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ దాడికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ దాడి అధికార తృణమూల్ కాంగ్రెస్ పనేనని బీజేపీ ఆరోపించింది. ‘మేము ఆ ప్రాంతానికి చేరుకునే సరికి దుండగులు మా అభ్యర్థిపై దాడి చేశారు. మేము ప్రతిఘటించాం. కేంద్ర బలగాలు అక్కడ ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థిపై వారు దాడి చేశారు’ అని విమర్శించారు.
వెదురు కర్రలతో కొట్టారని బీజేపీ మద్దతుదారు ఒకరు మీడియాకు తెలిపారు. ఈ దాడి టీఎంసీ డైమండ్ హార్బర్ అభ్యర్థి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గూండాల పనేనని బీజేపీ నేత, బరాక్‌పోర్ ఎంపీ అర్జున్ సింగ్ ఓ ట్వీట్‌లో ఆరోపించారు. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే అయిన దీపక్ హల్దార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీలో చేరారు. ఇక్కడ ఏప్రిల్ 6న పోలింగ్ జరుగనున్నది.