భర్తకు కరొనతో ప్రియాంక ఎన్నికల సభలు రద్దు

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రా కరోనా పాజిటవ్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్య పరీక్షల్లో తేలడంతో ప్రియాంక గాంధీ ప్రస్తుతం సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లాయి. అయితే, ప్రియాంకకు కరోనా నెగిటివ్ వచ్చింది. 

సెల్ఫ్ ఐసొలేషన్ కారణంగా అసోం, తమిళనాడు, కేరళలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ప్రియాంక రద్దు చేసుకున్నారు. ఎన్నికల ప్రచార సభలకు హాజరుకాలేక పోతున్నందుకు మన్నించాల్సిందిగా ఆమె ఓ వీడియో సందేశంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనకు నెగిటివ్ వచ్చినప్పటికీ ఐసొలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించడంతో నిబంధనలను పాటించాల్సి వస్తోందని చెప్పారు.

‘నాకు కరోనా నెగిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. అయినప్పటికీ సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో షెడ్యూల్ ప్రకారం శుక్రవారం అసోంలో, శనివారం తమిళనాడులో, ఆదివారం కేరళలో జరగాల్సిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనలేకపోతున్నాను’ అని ఆ వీడియోలో ప్రియాంక తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారం అసోంలో తుది విడత పోలింగ్‌కు ముందు శుక్రవారంనాడు మూడు ర్యాలీల్లో ప్రియాంక పాల్గొనాల్సి ఉంది.

కాగా, తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఇటీవల తెలిపిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాజాగా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్య చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరినట్టు సచిన్ ట్విటర్ ద్వారా తెలిపాడు. 

`నేను త్వరగా కోలుకోవాలని మీరు చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు. వైద్యుల సూచనల మేరకు నేను కొద్ది సేపటి క్రితమే ఆస్పత్రిలో చేరాను. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ప్రపంచకప్ గెలుచుకుని పదేళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయులందరికీ, నా టీమ్‌మేట్స్‌కు అభినందనల`ని సచిన్ ట్వీట్ చేశాడు.