11 రాష్ట్రాల్లో ‘తీవ్రమైన ఆందోళనకర’ పరిస్థితులు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.11 రాష్ట్రాల్లో ‘తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు’ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 

గత 14 రోజులలో ఈ రాష్ట్రాల నుంచి 90 శాతం కేసులు వచ్చాయని పేర్కొంది. గత కరోనా దశ కంటే ఈసారి 11 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే మహారాష్ట్ర విషయంలో మాత్రం తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని పునరుద్ఘాటించింది. 

కోవిడ్ కేసుల విషయంలో తక్షణమే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కోవిడ్‌ను అరికట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న అన్ని వనరులనూ ఉయోగించాలని, ఆరోగ్య శాఖే కాదు, ఇందుకు అన్ని శాఖలూ ప్రభుత్వాలకు సహకరించాలని రాజీవ్ గౌబా విజ్ఞప్తి చేశారు. 

ఈ ఏడాదిలో ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం రోజువారీ కేసులు 90వేలకు చేరువయ్యాయి. రోజు రోజుకు వైరస్ విజృంభించడంతో పాటు మరణాలు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 89,129 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

గతేడాది సెప్టెంబర్‌ 20 తర్వాత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మహమ్మారి ప్రభావంతో రికార్డు స్థాయిలో 714 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,23,92,260కు చేరగా.. మహమ్మారి ప్రభావంతో మొత్తం 1,64,110 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 44,202 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,15,69,241 మంది కోలుకున్నారు.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సిన్ల మోతాదుల సంఖ్య ఏడు కోట్లు దాటిందని కేంద్రం తెలిపింది. శుక్రవారం ఒక్కరోజు రాత్రి 8 గంటల వరకు ఇచ్చిన 12, 76, 191 వ్యాక్సిన్లతో కలిపి ఈ సంఖ్య నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తం 7,06, 18, 026 మోతాదులు వినియోగించినట్లు తెలిపింది. ఇందులో 6,13,56,345 మంది తొలి డోసు తీసుకున్నారని వెల్లడించింది. రెండు మోతాదులు తీసుకున్న వారి సంఖ్య 92,61, 681 మంది. వీరిలో 89, 03, 809 మంది ఆరోగ్య కార్యకర్తలున్నారని, 95, 15, 419 మంది 95,15,410 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు తొలి డోసు తీసుకున్నారని తెలిపింది.