లాక్-డౌన్ నిబంధనలు పట్టించుకోని తెలంగాణ గురుకుల పాఠశాల: ఏబీవీపీ ఆందోళన 

కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తున్న కారణంగా  తెలంగాణ ప్రభుత్వం మార్చి 27 నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అదే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఈ నిబంధనను అతిక్రమించడం  తీవ్ర చర్చనీయాంశమైంది.
తెలంగాణ గురుకుల పాఠశాలలకు చెందిన సుమారు 300 మందికి పైగా విద్యార్థులను ప్రత్యేక బోధనల పేరిట సమీకరించి, వారిని మొయినాబాద్ వద్దనున్న ఆజాద్ ఇంజనీరింగ్ పాఠశాలలో ఉంచిన విషయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు గుర్తించారు. దీనిపై ఇంజనీరింగ్ కళాశాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినప్పటికీ, అవేమీ తమకు వర్తించవన్న రీతిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు వ్యవహరిస్తున్నాయని, విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టి వారిని ఇక్కడ నిర్బందించారని ఏబీవీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బాధ్యత వహించాలని, బాధ్యులపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీరుపై అనేక విమర్శలు తలెత్తాయి. గురుకులాల్లో స్వేరోల మితిమీరిన పెత్తనం, హిందూ వ్యతిరేక కార్యకలాపాలపై నివేదిక అందించాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో తాజా ఘటన జరగడం గమనార్హం.