డ్రగ్స్ కేసులో నలుగురు తెలంగాణ ఎమ్యెల్యేలు?

కర్ణాటకలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో నలుగురు తెలంగాణ ఎమ్యెల్యేలు కూడా ఉన్నారనే కధనాలు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనాలు రేపుతున్నాయి. వీరిని త్వరలో బెంగుళూరు పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కొన్నాళ్ల క్రితం ఓ డ్రగ్స్ కేసుకు సంబంధించి కొంతమంది నైజీరియన్లను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌కు చెందిన కలహర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కన్నడ నిర్మాత శంకర్ గౌడ్‌లకు కూడా డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయని తేలింది. దాంతో పోలీసులు సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, కలహర్ రెడ్డి, శంకర్ గౌడ్‌లు తప్పించుకు తిరుగుతున్నారు. పోలీసుల విచారణలో సందీప్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించాడు. డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయని సందీప్ తెలిపాడు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డి ఇద్దరూ కలిసి బెంగుళూరులో పబ్‌లు, హోటల్స్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ తెలంగాణకు చెందిన ప్రముఖులకు నిత్యం పార్టీలు ఇచ్చేవారు. అంతేకాకుండా వీరికి కన్నడ సినీపరిశ్రమతో కూడా సంబంధాలున్నాయి. వీరు పలు సినిమాలకు ఫైనాన్స్ కూడా చేస్తున్నారు. కన్నడ నిర్మాత శంకర్ గౌడ్ వీరిద్దరికీ సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

కలహర్, సందీప్, శంకర్‌‌లకు నైజీరియన్లు డ్రగ్స్ సరఫరా చేసేవారు. నైజీరియన్ల సమాచారం మేరకు ఈ ముగ్గురు వ్యాపారవేత్తలకు బెంగుళూరు పోలీసులు నోటీసులిచ్చారు. సందీప్ చెప్పిన సమాచారం ప్రకారం కలహర్ వివిధ పార్టీల ప్రజాప్రతినిధులకు పార్టీలిచ్చేవాడని తెలిసింది. 

ఆ పార్టీలలో తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగు సినీప్రముఖులు కూడా పాల్గొన్నారని సందీప్ తెలిపాడు. ఓ ఎమ్మెల్యే అయితే ఏకంగా ఆయనే నేరుగా కొకైన్ తీసుకెళ్లాడని సందీప్ చెప్పాడు. కొన్నిసార్లు ఆ ఎమ్మెల్యే కోరిక మేరకు కొకైన్ ఇంటికి పంపినట్లు సందీప్ తెలిపాడు. 

అంతేకాకుండా  ఈ ఎమ్మెల్యేతో పాటు మరో ముగ్గురు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు సందీప్ చెప్పాడు. దాంతో కలహర్ రెడ్డి, శంకర్ గౌడ్‌లతో పాటు ఆ నలుగురు ఎమ్మెల్యేలను కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఈ ఎమ్మెల్యేలకు బెంగుళూరు కేంద్రంగా కొన్ని ఇతర వ్యాపారాలు ఉన్నాయి. వీలు చిక్కినప్పుడు వీరంతా బెంగళూరు వెళ్లి ఉంటారని తెలుస్తోంది.