లేబర్‌ కోడ్‌ల అమలు వాయిదా 

కార్మిక సంస్కరణలతో భాగంగా వివిధ కార్మిక చట్టాలను క్రోడీకరిస్తూ  కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ల అమలు వాయిదా పడింది. సంబంధిత నిబంధనలను రాష్ట్రాలు ఇంకా ఖరారు చేయకపోవడంతో ఏప్రిల్‌ 1 నుంచి జరగాల్సిన నాలుగు కార్మిక చట్టాల అమలును కేంద్రం వాయిదా వేసింది. 

కోడ్‌ల అమలు ప్రక్రియ వాయిదా పడినందున ‘ఇంటికి తీసుకెళ్లే వేతనాల మొత్తం’లో ఈ సారికి ఎలాంటి మార్పు వుండదు. కంపెనీలు కట్టే భవిష్యనిధి (పిఎఫ్‌) మొత్తాల్లో కూడా ప్రస్తుతానికి మార్పు లేనట్టే అని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కార్మిక నిబంధనలు అమల్లోకి వస్తే ఉద్యోగుల మౌలిక వేతనం, పిఎఫ్‌లను లెక్కించే పద్ధతిలో తీవ్రమైన ప్రభావం పడివుండేది.

నాలుగు లేబర్‌ కోడ్‌లను అమలు చేయాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఇదివరకే నిర్ణయించింది. ఈ కోడ్‌ల కింద నిబంధనలను కూడా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొన్ని పారిశ్రామిక రాష్ట్రాలైనా కోడ్‌ల నిబంధనలను ఖరారు చేస్తాయని కేంద్రం భావించింది. 

అయితే ఆ దిశగా రాష్ట్రాల నుంచి స్పందన రాకపోవడంతో ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రావాల్సిన కోడ్‌లు ప్రస్తుతానికి వాయిదా పడినట్లేనని కార్మిక శాఖకు చెందిన ఒక సీనియర్‌ అధికారి నిర్ధారించారు. ఇప్పటి వరకు జమ్ముకాశ్మీర్‌ ఒక్కటే నాలుగు లేబర్‌ కోడ్‌లకు నిబంధనలను ఖరారు చేసి నోటిఫై చేసింది.

ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ రెండు కోడ్‌లకు ముసాయిదా నిబంధనలను సిద్ధం చేశాయి. కర్ణాటక ఒక కోడ్‌కు మాత్రమే నిబంధనలను ఖరారు చేసింది. ఇక మిగిలిన రాష్ట్రాలేవీ ఈ దిశగా స్పందించలేదు.

భారత రాజ్యాంగం ప్రకారం కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. అందువల్ల తమతమ పరిధులలో ఈ నాలుగు కోడ్‌లు అమల్లోకి రావాలంటే అటు కేంద్రంతోపాటు, ఇటు రాష్ట్రాలు కూడా నిబంధనలను నోటిఫై చేయాల్సి వుంటుంది.

నూతన వేతనాల చట్టం కింద, అలవెన్సులు 50 శాతానికే పరిమితమవుతాయి. అంటే ఉద్యోగి స్థూల వేతనంలో సగం మౌలిక వేతనంగా వుండాల్సి వుంటుంది. మౌలిక వేతనంలో కొంత శాతాన్ని పిఎఫ్‌గా లెక్కిస్తారు. బేసిక్‌ పే, డిఎ కలిసి మౌలిక వేతనంగా వుంటుంది.