పాన్‌, ఆధార్ లింక్‌ గడువు జూన్‌ 30కు పొడిగింపు

పాన్‌, ఆధార్‌ కార్డు అనుసంధాన తుది గడువును జూన్‌ 30 వరకు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31(బుధవారంతో) తో ఈ గడువు ముగియనున్నది. అయితే చివరి రోజు పాన్‌, ఆధార్ లింక్‌ కోసం చాలా మంది ప్రయత్నించారు. 

దీంతో ఐటీ శాఖ వెబ్‌సైట్‌ క్రాష్‌ అయ్యింది. ఈ కారణంతోపాటు కరోనా నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించేందుకు లింక్‌ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొగిడించింది.

కాగా, పాన్ కార్డుతో ఆధార్ కార్డును మార్చి 31లోగా లింక్ చేయకపోతే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల హెచ్చరించింది. మార్చి 23న లోక్‌స‌భ‌లో ఈ మేరకు ఆర్థిక బిల్లు-2021కి కీల‌క స‌వ‌ర‌ణ చేసి ఆమోదించింది. 

ఇన్‌కం ట్యాక్స్ చ‌ట్టం-1961లో కొత్తగా 234హెచ్ సెక్ష‌న్‌ను చేర్చింది. కొత్త సెక్ష‌న్ ప్ర‌కారం పాన్‌కార్డు ఉన్న‌వాళ్లంతా ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. లేదంటే జ‌రిమానా చెల్లించాల్సి వ‌స్తుందని కేంద్ర ప్రభుత్వం అందులో పేర్కొంది.

అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం.. ఏ వ్యక్తైనా తన పాన్‌ను సమర్పించాలని అధికారులు కోరినపుడు ఆ వ్యక్తి తన పాన్‌ను సమర్పించకపోయినా, పనిచేయని పాన్‌ను సమర్పించినా అధిక టీడీఎస్ లేదా టీసీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుంది. 

అదేవిధంగా ఆదాయపు పన్ను రిటర్న్‌ల‌ను దాఖలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇన్‌కం ట్యాక్స్ రిట‌ర్న్‌ల‌ను స‌మయానికి దాఖ‌లు చేయ‌క‌పోతే దానికి సంబంధించిన పర్యవసానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.