84 దేశాలకు 64 మిలియన్ల వ్యాక్సిన్‌ డోసులు 

84 దేశాలకు 64 మిలియన్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను భారత్‌ సరఫరా చేసినట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి జరిగిన చర్చలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
దేశంలో ఇప్పటికే సుమారు ఆరుకోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. సాంకేతిక శాస్త్ర విజ్ఞానం అందించే ప్రయోజనాలు ప్రపంచం మొత్తానికి దక్కాలని తాము భావిస్తున్నామని, దానిలో భాగంగానే ఇప్పటివరకు 84 దేశాలకు 64 మిలియన్ల వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేశామని ఆయన తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రిగా తనకు ఎదురైన సవాళ్లను వెల్లడించారు. భారత్‌లో జనాభా, వైవిధ్యతే అతిపెద్ద సవాలని పేర్కొంటూ  ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉందని హెచ్చరించారు. 
 
జనవరి 17నే వీటిపై మార్గదర్శకాలను జారీ చేశామని చెబుతూ  పరీక్షలు, వెంటిలేటర్లు, పర్యవేక్షణ, క్వారంటైన్‌ కేంద్రాలు వంటి సౌకర్యాలను అభివఅద్ధి చేశామని తెలిపారు. వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని మరింత విస్తరించే క్రమంలో 50 వేల టీకా కేంద్రాల ఏర్పాటుతో పాటు, 7లక్షల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు.