ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందజూస్తున్న కాంగ్రెస్

అస్సాం ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ విడదీసి రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. బుధవారం అస్సాంలోని కుమ్రప్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చుపెట్టి ల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ద‌ని ధ్వజమెత్తారు. 

ఉమ్మడి లక్ష్యంతో, ఉమ్మడి ప్రయోజనాలతో తాము ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం చీలిక రాజకీయాలు చేస్తోందని అమిత్ షా మండిపడ్డారు. రాజ‌కీయా స్వార్థంతో అసోంలో బోడో-నాన్ బోడో, అస్సామీ-బెంగాలీ, హిందూ-ముస్లిం, అప్ప‌ర్ అస్సాం-లోయ‌ర్ అస్సాం, ట్రైబ్‌-నాన్ ట్రైబ్ పేరుతో గొడ‌వ‌లు సృష్టిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు.

‘‘బోడో-నాన్ బోడో, అస్సామీ-బెంగాలీ, హిందూ-ముస్లిం, ఎగువ అస్సాం-దిగువ అస్సాం, గిరిజన-గిరిజనేత.. ఇలా అస్సాం ప్రజల్ని విడదీస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోంది” అంటూ విమర్శించారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ (అందరికీ అభివృద్ధి, అందరి నమ్మకం) అనే నినాదంతో ప్రజల్ని ఏకం చేస్తున్నారని పేర్కొన్నారు. 

“మేం ప్రతి ఒక్కరికి తాగునీరు అందించాం. ముస్లిం ఇళ్లకు కూడా తాగు నీరు వచ్చాయి. అంతే కాదు, ఇళ్లు కట్టుకోవాడానికి మైనారిటీలకు కూడా సహాయం చేశాము. రైతులకు అందించిన 10 వేల రూపాయల ఆర్థిక సాయం మైనారిటీ, గిరిజన, బోడోలకు కూడా అందాయి’’  అమిత్ షా వివరించారు. 

త‌మ పాల‌న‌లో హిందూ, ముస్లింలు అంద‌రికీ ఓకే రీతిన ప్ర‌భుత్వ ఫ‌లాలు అందుతాయ‌ని చెబుతూ అసోంలో బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే.. మైనారిటీలు, గిరిజ‌నులు, బోడోలు అనే తార‌త‌మ్యాలు లేకుండా అన్ని వ‌ర్గాల రైతుల‌కు ఒకేర‌కంగా రూ.10,000 చొప్పున అంద‌జేస్తామ‌ని అమిత్ షా ప్ర‌క‌టించారు.