ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ లో చివరి ముగ్గురు నిందితులు విడుదల

ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో ముగ్గురు పోలీసులను అహ్మదాబాద్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు బుధవారం విడుదల చేసింది. జీఎల్ సింఘాల్, తరుణ్ బరోట్, అనాజు చౌదరిలను విడుదల చేసేందుకు ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి వీఆర్ రావల్ బుధవారం అనుమతించారు. ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ 2004 లో జరిగింది.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న చివరి నిందితులు అయిన ముగ్గురు పోలీసులు అవసరమైన అనుమతి మంజూరు కావడంతో విచారణను విరమించుకోవాలని కోరుతూ మార్చి 20 న కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. వారి అభ్యర్ధనను అనుసరించి  ఎన్‌కౌంటర్ కేసులో ముగ్గురు నిందితులపై ప్రాసిక్యూషన్ మంజూరును గుజరాత్ ప్రభుత్వం తిరస్కరించిందని ప్రత్యేక కోర్టుకు సీబీఐ స్పెషల్ ప్రాసిక్యూటర్ ఆర్‌సీ కోడేకర్ తెలిపారు.

వారు తమ అధికారిక విధుల్లో భాగంగా పనిచేశారని ప్రత్యేక న్యాయస్థానం తన 2020 అక్టోబర్ నాటి ఉత్తర్వులలో గమనించారు. కాబట్టి ప్రాసిక్యూషన్‌కు అనుమతి పొందడం అవసరం. సీబీఐ 2013 లో దాఖలు చేసిన మొదటి చార్జిషీట్‌లో నిందితులుగా పాండే, వంజారా, అమిన్, సింఘాల్, బారోట్, పర్మార్, చౌదరి అనే ఏడుగురు పోలీసు అధికారులను పేర్కొన్నది.

2019 లో సీబీఐ కోర్టు మాజీ పోలీసు అధికారులు డీజీ వంజారా, ఎన్‌కే అమిన్‌లపై కేసులను విరమించుకున్నది. 2018 లో మాజీ ఇంఛార్జీ డీజీపీ పీపీ పాండే కేసు నుంచి విడుదలయ్యారు. విచారణ జరుగుతున్న సమయంలో పర్మార్ చనిపోయారు.

ముంబై సమీపంలోని ముంబ్రాలో నివసించే 19 ఏండ్ల వయసున్న ఇష్రత్ జహాన్.. 2004 జూన్ 15 న అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఈమెతో పాటు జావేద్ షేక్ అలియాస్ ప్రణేష్ పిళ్ళై, అమ్జదాలి అక్బరాలి రానా, జీషన్ జోహార్‌ కూడా ఎన్‌కౌంటర్‌లో గుజరాత్‌ పోలీసులు చంపేశారు.

ఈ నలుగురు ఉగ్రవాదులని పోలీసులు ఆరోపించారు. వారు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్రపన్నారని గుజరాత్‌ పోలీసులు పేర్కొన్నారు. అయితే, హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ ఎన్‌కౌంటర్ నకిలీదని తేల్చి చెప్పింది. ఆ తర్వాత సీబీఐ పలువురు పోలీసు అధికారులపై కేసు నమోదు చేసింది.