జూనియర్‌ ఎన్టీఆర్‌ వస్తారా? టిడిపిని బతికిస్తారా!

వరుస పరాజయాలతో పాటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులలో ఉన్నవారంతా దాదాపు మౌనం వహిస్తున్న సమయంలో రెండు రోజుల క్రితం జరిగిన టిడిపి 40వ వ్యవస్థాపక దినోత్సవం ఆ పార్టీలో నెలకొన్న నిరాశ, నిస్పృహలను వెల్లడి చేసింది. రాజకీయంగా పార్టీ మనుగడ పట్ల పలువురు నాయకులు ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు. 
 
ప్రస్తుతం పార్టీకి అన్నింటా తానై ఉండి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు వయస్సు 70 ఏళ్ళు దాటటంతో నూతన నాయకత్వంను ప్రోత్సహించనిదే పార్టీకి భవిష్యత్ లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తన రాజకీయ వారసునిగా కుమారుడు లోకేష్ కు ఇప్పటికే కీలక ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ఆయన రాజకీయ సామర్ధ్యం పార్టీ వర్గాలకు విశ్వాసం కలిగించడం లేదు. పైగా 2019లో పార్టీ ఘోర పరాజయానికి అనేకమంది ఆయననే కారకునిగా చెబుతున్నారు. 
 
టిడిపిలో ఎప్పుడు ఎటువంటి సంక్షోభం ఏర్పడినా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును పోలి ఉండే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి, పార్టీని బతికించాలనే వాదనలు ఆ పార్టీ వర్గాల నుండి బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా అధికారమలో ఉన్న కొందరు వైసిపి మంత్రులు సహితం జూనియన్ ఎన్టీఆర్ వస్తేగాని టిడిపికి భవిష్యత్ లేదనే పల్లవి అందుకోవడం ఆసక్తి కలిగిస్తున్నది. 
 
టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  రాజమండ్రిలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ   టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పేర్కొంటూ టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోందంటూ ఆయన చేసిన ప్రకటన కలకలం రేపుతున్నది. 
 
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు వచ్చి పార్టీని బలోపేతం చేయాలనీ అంటూనే `ఎవ్వరో పిలుస్తారని వేచి చూడవద్దు’ అంటూ చెప్పడం కూడా గమనార్హం. 2009 ఎన్నికలలో మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ టిడిపి కోసం ఉత్తరాంధ్రలో ప్రచారం చేశారు. ఆ తర్వాత రోడ్ ప్రమాదానికి గురయి అర్ధాంతరంగా వెళ్లి పోవలసి వచ్చింది.
ఆ తర్వాత ఎప్పుడు ఆయన పార్టీ వేదికలపై కనిపించడం గాని, రాజకీయాల పట్ల ఆసక్తి ప్రదర్శించడం గాని చేయలేదు. కుమారుడు లోకేష్ ను నాయకుడిగా ప్రోత్సహించే ప్రయత్నంలో ఉద్దేశ్యపూర్వకంగానే జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబునాయుడు జాగ్రత్త పడుతున్నట్లు అందరు భావిస్తున్నారు.
 
ఎమ్జీఆర్‌, ఎన్టీఆర్,‌ జయలలిత మినహా రాజకీయాలలో చెప్పుకోదగిన విజయాలు సాధించిన సినీ తారలు లేరని చెప్పవచ్చు. చిరంజీవి, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రయత్నాలు చేస్తున్నా చెప్పుకోదగిన విజయాలు సాధింప లేక పోతున్నారు. ఎంతోకాలం రాజకీయాలలోకి వస్తున్నానని అంటూ రజనీకాంత్ తోకముడిచారు.
 
 ఈ మధ్య ఒక సినిమా ఫంక్షన్‌లో ఏకంగా సిఎం ఎన్టీఆర్‌ అని నినాదాలిస్తే ఆయనే కోప్పడి ఆపాల్సి వచ్చింది.ఈ మధ్యనే ఒక వాణిజ్య కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు జూనియర్‌ను దీనిపై అడిగితే ఇది అసందర్భం అని జవాబిచ్చారు. లోకేష్ ను కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారని ఎవ్వరు ఆశింపలేరు. అటువంటి పరిస్థితులలో నటుడిగా మంచి భవిష్యత్ ను వదులుకొని రాజకీయాల పేరుతో ఊరేగడం కూడా ఆయనకు సాధ్యం కాదు. 
 
ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి వారు కీలకమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రంగప్రవేశం చేసి, రాజకీయాలలో విజయాలు సాధించారని మరచిపోలేము. వారు సహితం తర్వాత పలు పరాజయాలను చూడవలసి వచ్చింది.  జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా వయస్సుకు మించిన పరిణితిని ప్రదర్శిస్తున్న రాజకీయాలలో  నెగ్గుకు రావాలంటే అది మాత్రమే సరిపోదు. టిడిపి వర్గాలను భయపెడుతున్న `నాయకత్వ సంక్షోభం’ లేదా `రాజకీయ అభద్రతాభావం’ కారణంగానే తరచూ జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారని చెప్పవచ్చు.