బిజెపి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు 

కాంగ్రెస్ మాదిరిగా తాము ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం లేదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. దేశంలోని అల్ప సంఖ్యాక వర్గాల విషయంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరి మొదటి నుంచి చాలా స్పష్టంగా ఉందని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ అమలు చేసిన ఓటు బ్యాంకు రాజకీయాలతో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి విధానానికి సంబంధం లేదని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారి 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు చాలా స్పష్టంగా ఓ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. 

ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా తన ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడబోదని స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. వివక్ష లేని అభివృద్ధి, సంతుష్టీకరణలేని సాధికారతలను మోదీ ప్రభుత్వం నమ్ముతోందని, దీనిని సాధిస్తోందని చెప్పారు. 

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారుల సంఖ్య పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు. విద్యార్థుల ఉపకార వేతనాలను పొందే మైనారిటీలు 2007-08 నుంచి 2013-14 మధ్య కాలంలో మూడు కోట్ల మంది ఉండేవారని, 2014-15 నుంచి 2020-21 మధ్య కాలంలో 4.5 కోట్లకు పెరిగారని చెప్పారు. ఈ నాలుగున్నర కోట్ల మందిలో 3.3 కోట్ల మంది ముస్లింలేనని వివరించారు.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, కేరళ శాసన సభ ఎన్నికల ప్రక్రియ మార్చి 27 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. నఖ్వీ గత వారం పశ్చిమ బెంగాల్, అస్సాంలలో పర్యటించి, బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం ఆయన కేరళలో పర్యటిస్తున్న ఆయన  బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు చేస్తున్న బూటకపు ప్రచారాన్ని తిప్పికొట్టగలననే ఆశాభావం వ్యక్తం చేశారు.