12.5 శాతం వరకు జిడిపి వృద్ధి… ప్రపంచ బ్యాంకు 

12.5 శాతం వరకు జిడిపి వృద్ధి… ప్రపంచ బ్యాంకు 

కోవిడ్-19 మహమ్మారి, దేశవ్యాప్త అష్టదిగ్బంధనం నుంచి భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఆశ్చర్యకరంగా కోలుకుందని, అయితే కష్టాల నుంచి ఇంకా బయటపడలేదని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (రియల్ జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 12.5 శాతం వరకు ఉండవచ్చునని అంచనా వేసింది.

ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) యాన్యువల్ స్ప్రింగ్ మీటింగ్ త్వరలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు సౌత్ ఆసియా ఎకనమిక్ ఫోకస్ నివేదికలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకున్న తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 

కోవిడ్-19 మహమ్మారి చుట్టుముట్టడానికి ముందే భారత దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని గుర్తు చేసింది. 2017తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.3 శాతంగా ఉండేదని, 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇది 4.0 శాతానికి తగ్గిందని వివరించింది. వ్యక్తిగత వినియోగ వృద్ధి క్షీణించడంతోపాటు ఆర్థిక రంగంలో ఒడుదొడుకులు, పెట్టుబడుల్లో అంతకుముందు నుంచి ఉన్న బలహీనతల కారణంగా ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ మందగించిందని తెలిపింది.

ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో, దేశీయంగా, ముఖ్యమైన ఎగుమతి మార్కెట్లలో, కరెంట్ అకౌంట్ తిరిగి స్వల్ప లోటు స్థితికి, అంటే 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు 1 శాతానికి, చేరుకుంటుందని అంచనా వేసింది. 

ప్రపంచ బ్యాంకు సౌత్ ఆసియా రీజియన్ చీఫ్ ఎకనమిస్ట్ హాన్స్ టిమ్మర్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఓ సంవత్సరం క్రితంతో పోల్చినపుడు భారత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకున్న తీరు ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఓ ఏడాది క్రిందట మాంద్యం చాలా తీవ్రంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

మునుపెన్నడూ లేనివిధంగా కార్యకలాపాల్లో 30 నుంచి 40 శాతం వరకు క్షీణత కనిపించిందని తెలిపారు. వ్యాక్సిన్ల గురించి స్పష్టత ఉండేది కాదని,  కోవిడ్-19 గురించి తీవ్ర అనిశ్చితి ఉండేదని పేర్కొన్నారు. అయితే భారత్ ప్రస్తుతం మళ్ళీ కోలుకుంటోందని చెప్పారు. 

చాలా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, వ్యాక్సినేషన్ ప్రారంభమైందని, వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ ప్రధాన స్థానంలో ఉందని ప్రశంసించారు. అయితే ప్రస్తుత పరిస్థితి సవాలు విసురుతోందని స్పష్టం చేశారు. కోవిడ్-19 మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోందని, అందరికీ వ్యాక్సినేషన్ చేయడం పెద్ద సవాలు అని తెలిపారు. 

చాలా మంది ఈ సవాలును తక్కువగా అంచనా వేస్తున్నారని పేర్కొంటూ  ఆర్థిక రంగం పుంజుకుంటున్నప్పటికీ గణాంకాల విషయంలో అనిశ్చితి నెలకొందని చెప్పారు. రెండేళ్ళ నుంచి వృద్ధి జరగడం లేదని, రెండేళ్ళ నుంచి తలసరి ఆదాయం క్షీణిస్తోందని గుర్తు చేశారు. భారత దేశానికి అలవాటైనదానికి భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో అనేక విభాగాలు ఇంకా కోలుకోలేదని, ఈ మహమ్మారి లేకపోతే ఈ విభాగాలు ఏ స్థాయిలో ఉండేవో ఆ స్థాయికి చేరలేదని వివరించారు.