నందిగ్రామ్‌లో అమిత్‌షా భారీ రోడ్‌షో

రెండో విడుత ఎన్నికల ప్రచారానికి తెరదించడానికి కొన్ని గంటల ముందు నందిగ్రామ్‌లో బీజేపీ భారీ రోడ్‌షో నిర్వహించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర పార్టీ కార్యకర్తలు, అభిమానులు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ రోడ్‌షోలో బీజేపీ మాజీ సారథి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, నందిగ్రామ్‌ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పాల్గొన్నారు.

బీజేపీ జెండాలతో అలంకరించిన టాప్‌లేని వాహనంపై నిలుచుని ఉన్న అమిత్‌షా.. రోడ్‌షో ఆసాంతం కార్యకర్తలను, నాయకులను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నందిగ్రామ్‌లో బీజేపీ భారీ రోడ్‌షో చేపట్టడం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

నందిగ్రామ్‌లో ఇవాళ జరిగిన రోడ్‌షో చూస్తుంటే, ఈ ప్రదర్శనకు హాజరైన వేలాది కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఇక్కడ మమత ఓటమి తప్పదని, సువేందు అధికారిదే విజమని అనిపిస్తుందని  అమిత్‌షా ఈ సందర్భంగా భరోసా వ్యక్తం చేశారు. బీజేపీ నిర్వహించిన భారీ రోడ్‌షో అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో పరివర్తనం రావాలంటే నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడటం ఒక్కటే అని  పిలుపునిచ్చారు.

గతంలో మమతా బెనర్జీ వెనుకే ఉండి నందిగ్రామ్‌లో తృణమూల్‌ను ముందుకు నడిపిన సువేందు అధికారి ఈసారి బీజేపీ అభ్యర్థిగా తన ప్రత్యర్థి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే పోటీ చేస్తున్నారు. దాంతో ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్శిస్తున్నది.

తూర్పు మిడ్నాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బెతురియా, రాయపారా మధ్య నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు గుమిగూడారు. ‘జై శ్రీ రామ్’, ‘నరేంద్ర మోదీ జిందాబాద్’, ‘అమిత్ షా జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఏప్రిల్ 1 న ఎన్నికలు జరుగనున్న నందిగ్రామ్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది.