త‌మిళ‌నాడు నారీశ‌క్తిపై డీఎంకే దాడి 

త‌మిళ‌నాడు మ‌హిళ‌ల‌ను డీఎంకే అవ‌మాన‌ప‌రిచిన‌ట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ధారాపురంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొంటూ డీఎంకే కేవ‌లం అబ‌ద్దాల‌ను మాత్ర‌మే ప్ర‌చారం చేస్తోంద‌ని, త‌మ పార్టీకి చెందిన కాలంచెల్లిన 2జీ మిస్సైల్‌ను వాళ్లు ఇటీవ‌ల ప్ర‌యోగించార‌ని, రాష్ట్ర మ‌హిళ‌ల‌ను వాళ్లు టార్గెట్ చేశార‌ని ధ్వజమెత్తారు. 

ఇటీవ‌ల సీఎం ప‌ళ‌నిస్వామి త‌ల్లిపై డీఎంకే రాజా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఉద్దేశంతో రాజాను టార్గెట్ చేస్తూ మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా.. 2జీ స్కామ్‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నార ని గుర్తు చేశారు. మ‌రికొన్ని రోజుల్లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని, ఎన్‌డీకే కూట‌మి ఇక్క‌డ ప్ర‌జ‌ల ఆశీస్సులు తీసుకుంటోంద‌ని భరోసా వ్యక్తం చేశారు. 

అన్ని రంగాల అభివృద్ధి తమ ల‌క్ష్య‌మ‌ని చెబుతూ ఎంజీఆర్‌-జ‌య‌ల‌లిత ఆద‌ర్శాల‌తో అభివృద్ధి సాధిస్తామ‌ని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌-డీఎంకే కూట‌మి కుటుంబ రాజ‌కీయాలు చేస్తోంద‌ని ధ్వజమెత్తారు. మ‌హిళ‌ల‌పై ఓ సీనియ‌ర్ నేత అనుచిత కామెంట్స్ చేసినా.. డీఎంకే పార్టీ ఆ నేత‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని మోదీ విమర్శించారు. 

త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు కాంగ్రెస్‌-డీఎంకే కూట‌మిని గ‌మ‌నిస్తున్నార‌ని చెబుతూ  మ‌హిళ‌ల‌ను అవ‌మానిస్తే రాష్ట్ర ప్ర‌జ‌లు అంగీక‌రించ‌రని స్పష్టం చేశారు. 1989, మార్చి 25వ తేదీని ఎన్న‌టికీ మ‌రిచిపోవ‌ద్దు అని, త‌మిళ‌నాడు అసెంబ్లీలో డీఎంకే నేత‌లు జ‌య‌మ్మ‌తో ఎలా ప్ర‌వ‌ర్తించారో తెలుస్తోంద‌ని ప్రధాని గుర్తు చేశారు.  మ‌హిళా సాధికార‌త కోసం డీఎంకే-కాంగ్రెస్ కూట‌మి ప‌నిచేయ‌ద‌ని మోదీ దుయ్యబట్టారు.