కరోనా టీకాపై అపోహలు వద్దు

కరోనా టీకాపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ దేశ ప్రజలకు సూచించారు. మంగళవారం ఆయన తన సతీమణి నూతన్ గోయల్ తో కలిసి ఢిల్లీలోని హార్ట్‌ అండ్‌ లంగ్‌ ఇనిస్టిట్యూట్‌లో కరోనా టీకా రెండో డోసును వేయించుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి డోసు తీసుకున్న తర్వాత తనలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని స్పష్టం చేశారు. రెండు భారతీయ టీకాలు సురక్షితమైనవని , ఈ టీకాలపై ఉన్న అపోహలను తొలిగించేందుకు ప్రజలను చైతన్యవంతం చేస్తామని ఆయన చెప్పారు.

భారత్ లో జనవరి 16న ప్రారంభించిన టీకా ప్రక్రియలో భాగంగా  ఇప్పటి వరకు దేశంలో 6,11,13,354 మందికి టీకాలు వేసినట్టు ఆయన వెల్లడించారు. అర్హులైన ప్రతిఒక్కరు కరోనా టీకా వేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

 వాట్సాప్‌ యూనివర్సిటీలో సాగే ప్రచారాన్ని విశ్వసించరాదని సూచించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎవరికైనా ఇన్ఫెక్షన్‌ సోకినా అది తీవ్రతరమై దవాఖానలో చేరే పరిస్థితిని వ్యాక్సిన్‌ నివారిస్తుందని పేర్కొన్నారు. భారత్‌లో ప్రజలకు అందిస్తున్న కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ రెండూ సురక్షితమైనవని తెలిపారు.

కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌ మధ్య యువకులు, మధ్య వయస్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తేలింది. మొదటి వేవ్‌లో వృద్ధులపై ప్రభావం చూపగా.. ఇప్పుడు పెద్దగా వారిలో తీవ్రత కనిపించడం లేదని బెంగళూరు వైద్యులు గుర్తించారు. 

మార్చి మధ్య నాటి నుంచి కరోనా కేసులు పెరిగిన నాటి నుంచి బెంగళూరులో వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించిన వారిలో 20-39 మధ్య వయస్సున వ్యక్తులే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. 

ఈ నెల 17 నుంచి 26వ తేదీల మధ్య 20-29 సంవత్సరాల వయస్సున్న వారు 2,408 మంది, 30-39 సంవత్సరాల వయస్సున 2,547 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించినట్లు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికే డేటా పేర్కొంది. 

60-69 మధ్య 1,178 మంది, 70 ఏళ్లు పైబడిన వారిలో 828 మంది వైరస్‌ బారినపడ్డారు. వైరస్‌ ట్రాన్‌మిసిబిలిటీ పెరగడం, ప్రజల ప్రవర్తనే ఈ పరిస్థితికి దారి తీసిందని వైద్యులు పేర్కొంటున్నారు.