బంగారం కోసం కేరళ ప్రజలకు ఎల్డీఎఫ్‌ ద్రోహం

బంగారం కోసం కేరళ ప్రజలకు ఎల్డీఎఫ్‌ ద్రోహం

కొద్దిపాటి వెండి ముక్కల కోసం ఏసుక్రీస్తును జుడాస్ మోసగిస్తే, కొన్ని బంగారం ముక్కల కోసం ఎల్డీఎఫ్ ప్రభుత్వం కేరళ ప్రజలను మోసం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. పాలక్కాడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మోదీ మంగళవారం మాట్లాడుతూ, కేరళ రాజకీయాల్లో చాలా ఏళ్లుగా యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ మధ్య ‘మైత్రీ బంధం’ కొనసాగుతోందని ఎద్దేవా చేశారు.

ప్రజలు ఇప్పుడు ఆ పార్టీల ‘మ్యాచ్ ఫిక్సింగ్‌’ను ప్రశ్నిస్తున్నారని, వీళ్ల మోసాలను గమనిస్తున్నారని స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్, లెఫ్ట్ కలిసి పనిచేస్తున్నాయని, కేరళలో మాత్రం ప్రత్యర్థులుగా విమర్శలు గుప్పించుకుంటున్నారని దయ్యబట్టారు. యూపీఏ-1లో భాగస్వామ్యం కొనసాగించిన లెఫ్ట్ పార్టీ, యూపీఏ-2లో అంశాల వారిగా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసిందని గుర్తు చేశారు.

కేరళలో వామపక్షాలు చాలా సార్లు అధికారంలో ఉన్నాయని, కానీ వాళ్ల నేతలు ఇప్పటికీ జూనియర్ స్థాయి గూండాలుగా ప్రవర్తిస్తుంటారని ప్రధాని విమర్శించారు. వారి నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు హత్యలకు, నరికివేతలకు, దాడులకు గురయ్యారని విమర్శించారు. కేరళలో ఈ హింసకు తమ ప్రభుత్వం చరమగీతం పాడుతుందని ప్రధాని స్పష్టం చేశారు.

కేరళ సంస్కృతిని, సంప్రదాయాలని యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌లు తుంగలోకి తొక్కుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.  అమాయక భక్తులపై ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం లాఠీలీ ఝళిపించిందని, ఇంత జరుగుతున్నా యూడీఎఫ్ మౌనంగానే ఉండిపోయిందని తప్పుపట్టారు. కేరళకూ, పర్యాటరంగానికీ అవినాభావ సంబంధం ఉందని చెబుతూ  దురదృష్టవశాత్తూ పర్యాటక రంగంలో మౌలిక వసతుల కల్పనకు ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ చేసిందేమీ లేదని ప్రధాని పేర్కొన్నారు. సాంకేతికతను జోడించడం ద్వారా కేరళ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని మోదీ సూచించారు.

గత ప్రభుత్వాలు కనీస మద్దతు ధర ఇస్తామంటూ కేవలం హామీలే ఇచ్చేవని, కానీ, తమ ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచిందని ప్రధాని గుర్తు చేశారు. వ్యవసాయం, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని తెలిపారు. కేరళలో సత్వర (ఫాస్ట్) అభివృద్ధికి సమయం ఆసన్నమైందని మోదీ పిలుపిచ్చారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రజల ఆశీస్సులు కోరేందుకు, కేరళలో ఉన్న ప్రస్తుత పరిస్థితికి పూర్తి భిన్నంగా సరికొత్త విజన్‌తో తాను ప్రజల ముందుకు వచ్చానని మోదీ చెప్పారు. మెట్రో శ్రీధరన్ ప్రస్తావన చేస్తూ, ఆయన భారతదేశానికి నవీనరూపం, మెరుగైన అనుసంధానం కల్పించేందుకు అద్భుతమైన కృషి చేశారని ప్రశంసించారు. 

సమాజంలోని అన్ని వర్గాల అభినందనలను ఆయన అందుకున్నారని, కేరళ అభివృద్ధికి మెట్రో శ్రీధరన్ అంకితమయ్యారని పేర్కొన్నారు. కేరళ నిజమైన పుత్రుడిగా కేరళ అభ్యున్నతికి ఆయన కట్టుబడి ఉన్నారని తెలిపారు.