కేరళలో ట్రైయాంగిల్ ఫైట్!

కేరళలో ట్రైయాంగిల్ ఫైట్!
అక్షరాస్యత అత్యధికంగా ఉన్న కేరళ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతూ ఉండడం గత నాలుగు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్నది. ఆ రాష్ట్ర రాజకీయాలు రెండు ప్రధాన కూటముల మధ్య కేంద్రీకృతమై ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒక వైపు, సిపిఎం నాయకత్వంలోని ఎల్డిఎఫ్ మరోవైపు ఆ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాయి. 
 
బిజెపికి సహితం బలమైన పునాదులు ఉన్నప్పటికీ మొదటిసారిగా 2016 ఎన్నికలలోనే ఒక సీట్ గెల్చుకొని రాష్ట్ర శాసనసభలోకి ప్రవేశింప గలిగింది. దశాబ్దాలుగా వస్తున్న రాజకీయ వరవడి భిన్నంగా అధికారమలో ఉన్న ఎల్డిఎఫ్ తిరిగి గెలువబోతున్నట్లు ప్రస్తుతం  అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి.
140 మంది సభ్యులున్న రాష్ట్ర శాసన సభలు 41 నుండి 43 శాతం ఓట్లు పొందడం ద్వారా 75 నుండి 80 సీట్లు ఈ కూటమి పొందగలదని అంచనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ కు 37 నుండి 38 శాతం ఓట్లతో 55 నుండి 60 సీట్లను మించి గెల్చుకోలేదని ఈ అంచనాలు తేల్చి చెబుతున్నాయి.
 
అయితే ఈ సర్వేలను ఎవ్వరు విశ్వసింపడం లేదు. సిపిఎం నేతలైతే తాము 90 సీట్లు గెల్చుకోగలమని ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ శిబిరంలో కూడా అటువంటి అధికారంలోకి రాగలమనే భరోసా కనిపిస్తున్నది. కేరళ నుండి లోక్ సభకు ఎన్నికైన రాహుల్ గాంధీకి సహితం ఈ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవి. అందుకనే ఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతున్నా ఆయన ఎక్కువగా కేరళపైననే దృష్టి సారిస్తున్నారు.
2019 లోక్ సభ ఎన్నికలలో యూడీఎఫ్ ప్రభంజనం వీయడంతో ఇప్పుడు అదే వరవడి కొనసాగుతుందని ఆశ కాంగ్రెస్ లో కనిపిస్తున్నది. అయితే గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. ఇక బిజెపి, దాని మిత్రపక్షాలు కలసి 16 నుండి 17 శాతం ఓట్లతో మూడుకు మించి సీట్లు గెలిచే అవకాశం లేదని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
కానీ బిజెపి నేతలు తమ సీట్ల సంఖ్య రెండు అంకెలలో ఉంటుందని భరోసాతో ఉన్నారు. అంతేకాదు కాలం కలసి వస్తే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు గురించి కేరళలో బిజెపి నేతలు మొదటిసారిగా మాట్లాడటం ప్రాధాన్యత సంతరింప చేసుకున్నది. 
 
సీపీఎంలో విశేష ప్రజాదరణ గల నేత వి ఎస్ అచ్యుతానందన్. 2016 ఎన్నికలలో 86 ఏళ్ళ వయస్సులో ఆయన విస్తృతంగా ప్రచారం చేయడం కారణంగానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయననే ముఖ్యమంత్రిగా ప్రజలు విశ్వసించారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి పునరాయి విజయన్ పార్టీ అధినాయకత్వంతో తనకు గల సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి కాగలిగారు.
అప్పటి నుండి మొత్తం ప్రభుత్వం, పార్టీపై తన పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ సీట్ల కేటాయింపులో సహితం యువతకు అవకాశం పేరుతో తన ఆధిపత్యాన్ని వ్యతిరేకించే నేతలు చాలామందిని ఎన్నికలకు దూరంగా ఉంచారు. మరోవంక గతంలో ఎన్నడూ లేని విధంగా గోల్డ్ స్మగ్గ్లింగ్ కేసు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా జరగడంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది.
 
ఇక,  కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఆ పార్టీ అవకాశాలపై ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి. పార్టీ గెలుపొందితే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఎదురు చూస్తున్న ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రచార బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి ఉమ్మన్ చాందీకి కట్టబెట్టడంతో నిస్పృహకు గురయ్యారు. 
 
దేశం మొత్తం మీద ఆర్ ఎస్ ఎస్ కు అట్టడుగు వర్గాలలో మంచి పట్టు ఉన్న ప్రాంతం కేరళ. అయినప్పటికీ రెండు కూటముల మధ్య రాష్ట్ర రాజకీయాలు సమీకృతం కావడంతో బిజెపి చెప్పుకోదగిన పట్టు సాధింపలేక పోతున్నది. రెండు కూటములకు ప్రత్యామ్న్యాయంగా సామజిక సమీకరణాలను సాధింపలేక పోతున్నది.
ప్రజాకర్షణ గల నేతలు లేకపోవడం బిజెపి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అందుకనే ఈ సారి `మెట్రో మ్యాన్’గా దేశం అంతా  తెలిసిన శ్రీధరన్ ను ఎన్నికలలో పోటీ చేయించడమే కాకుండా, తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అనే సంకేతం కూడా ఇచ్చింది. తద్వారా విద్యావంతులు, యువకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. 
 
కేరళలో మొదటి సారిగా ఈ పర్యాయం త్రిముఖ పోటీ జరుగుతున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ భావిస్తున్నారు. కొద్దికాలం క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలలో బిజెపి చెప్పుకోదగిన విజయాలు సాధింప లేకపోయినా మొదటి సారిగా అత్యధికంగా వార్డ్ లలో పోటీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకోగలిగింది. 
 
“మేము 35 నుండి 40 సీట్లు గెల్చుకొంటే కాంగ్రెస్, సిపిఎం, ముస్లిం లీగ్, ఇతర పార్టీల నుండి బిజెపిలోకి ప్రవాహం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే సిపిఎం, యూడీఎఫ్ లకు చెందిన పలువురు బీజేపీలో చేరుతున్నారు. మరి అనేకమంది యూడీఎఫ్ నుండి చేరతారంటూ అనుకొంటున్నాము” అంటూ తమ ఎన్నికల విజయాలపై సురేంద్రన్ భరోసాతో కనిపిస్తున్నారు.
 
సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న  క్రైస్తవులు, ముస్లింల మధ్య ప్రస్తుతం దూరం పెరగడం బిజెపికి కలసివచ్చే అంశం. ఐరోపా దేశాలలో ఇస్లామిక్ ఉగ్రవాదం పట్ల కేరళలోని క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో మొదటి సారిగా కొన్ని ప్రముఖ చర్చలకు చెందిన మత పెద్దలు బిజెపి, ఆర్ ఎస్ ఎస్ నేతలతో తమ సమస్యల గురించి సమాలోచనలు జరుపుతున్నారు. 
 
కొద్దీ నెలల క్రితం రెండు చర్చి ల మధ్య చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ఆస్తుల వివాదం కోసం సహకరింపమని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలసి వచ్చారు. ఈ పరిణామాల ఫలితంగా క్రైస్తవుల నుండి కొద్దిపాటు ఓట్లు రాగలవని ఆశ బిజెపి వర్గాలలో కనిపిస్తున్నది. 
 
మరోవంక జోస్ కె మని నాయకత్వంలోని క్రిస్టియన్ కేరళ కాంగ్రెస్ తో సిపిఎం పొత్తు ఏర్పాటు చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కు అండగా ఉంటున్న క్రైస్తవ ఓటర్లలో ఈ సారి ఒక విధంగా చీలిక వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో ఫలితాలు సహితం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. 
 
అయితే గత ఎన్నికలలో గెలుపొంది, తిరిగి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పలువురు సిపిఎం అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఫలితాలపై దాని ప్రభావం ఉండకపోదు. పైగా కనీసం 10 నియోజకవర్గాలలో కాంగ్రెస్ నుండి కాకుండా బిజెపి నుండి తీవ్ర ప్రతిఘటనను వామపక్షాలు ఎదుర్కొంటున్నాయి. 
 
గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న నాడార్ ఓటర్లు క్రమంగా బిజెపి వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ  క్రైస్తవ, ముస్లిం పార్టీగా మిగిలిపోయింది. 2016లో గెలుపొందిన 47 మంది యూడీఎఫ్ శాసనసభ్యులలో 10 మంది మాత్రమే హిందువులు ఉన్నారు. అందుకనే ఇప్పుడు సిపిఎం ఎక్కువగా హిందూ ఓటర్లను తమకు అనుకూలంగా సమీకృతం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నది. బిజెపికి ఓట్లు, సీట్లు పెరిగితే రాజకీయంగా తాము భారీ మూల్యం చెల్లింపు వలసి వస్తుందని ఆ పార్టీ భయపడుతున్నది.
 
బిజెపి కనీసం 20 సీట్లు గెల్చుకొంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడటం తప్పదని, అటువంటప్పుడు రాజకీయ శక్తుల పునసమీకరణ జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శబరిమల అంశంపై చెలరేగిన వివాదం ప్రధానంగా తమకు సానుకూల వాతావరణం ఏర్పాటుకు దారితీయగలదని బిజెపి నేతలు భావిస్తున్నారు.
 
కీలకమైన ఆర్ధిక మంత్రి థామస్ ఐజాక్ కు సీట్ నిరాకరించడం యువతకు అవకాశం ఇవ్వడం కోసమని చెబుతున్నా హిందువుల దృష్టి ఆకర్షించడం కోసమే. పైగా మొదటి సారిగా సిపిఎం నేతలు ముస్లిం లీగ్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ముస్లింలకు రక్షణగా ఉంటున్నది ముస్లిం లీగ్ కాదని, వామపక్షాలని అంటూ విద్యుత్ మంత్రి ఎంఎం మణి పేర్కొనడం గమనార్హం. 
(వి6 వెలుగు నుండి)