రైతులకు క్షమాపణ చెప్పిన ఏపీ మంత్రి

తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ఏపీ గృహ నిర్మాణశాఖా మంత్రి శ్రీరంగనాథరాజు రైతులకు క్షమాపణ చెప్పారు. శనివారం  జరిగిన ఓ కార్యక్రమంలో వ్యవసాయ అంశంలో మాట్లాడుతూ  వరిసాగు ఉత్త సోమరిపోతు వ్యవహారం అన్న మాటలపై దుమారం చెలరేగింది. 
 
రైతులు, రైతు సంఘాలు ఆదివారం ఉదయమే ఆందోళనబాట పట్టి నిరసన తెలియజేయడంతో తిరుపతి పర్యటనలో ఉన్న మంత్రి శ్రీరంగనాథరాజు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు.
 
వరిసాగుపై తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని, రైతులకు క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రైతులకు క్షమాపణ చెప్పారు.
ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు సరిగా అందడంలేదనే ఆవేదనతో అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. కౌలు రైతులకిస్తున్న ఆ పథకాల ఫలాలను   భూముల యజమానులే అనుభవిస్తున్నారని, రైతుబిడ్డను కావడంతో నిన్న అలా మాట్లాడానని పేర్కొన్నారు.
రైతుల కోణంలో రైతుల కోసం తొందరపాటుతో ఈ వ్యాఖ్యలు చేశాననని వివరించారు. తన మాటలకు  రైతులు ఎవరైనా బాధపడితే తనను క్షమించాలని, రైతులను కించపరిచే ఉద్దేశం ఏదీ తనకు లేదని మంత్రి స్పష్టం చేశారు.