ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్

ఆంధ్ర ప్రదేశ్ లో  కొత్త జిల్లాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ నెల 31 వరకు మాత్రమే జనాభా లెక్కల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. 2021 జనాభా లెక్కల ప్రాతిపదికగానే కొత్త జిల్లాలు, కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాలని భావించారు. 
 
అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు 2021 జనాభా లెక్కలు అడ్డంకిగా మారింది. సామాజిక కార్యకర్త రవికుమార్‌ ఆర్టీఐ దరఖాస్తుతో వివరాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త జనాభా లెక్కలు పూర్తయ్యే వరకూ జిల్లా, మండల, గ్రామ రెవెన్యూ పరిధిలో మార్పులు చేయొద్దని కేంద్రం ఆదేశించింది.
 
దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు పూర్తయ్యేవరకూ జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడింది. కరోనా కారణంగా తాత్కాలికంగా జనగణన నిలిపివేశారు. దీంతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏడాదిన్నర పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
 
వాస్తవానికి జనాభా లెక్కల సేకరణ పక్రియ 2020లోనే ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. దానితో ఈ సంవత్సరం ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి అడ్డు ఏర్పడింది. 
 
2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దానితో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలో 25గా పెరగవలసి ఉంది. మరి కొన్ని అదనపు జిల్లాలు కలిపి మొత్తం 31 వరకు జిల్లాలు కావచ్చని అధికార వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.