ఏపీలో కొత్తగా 1,005 కరోనా కేసులు 

ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రత్యేకించి విద్యాసంస్థల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం  24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,005 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. 

ఇప్పటివరకు రాష్ట్రంలో 7,205కి కరోనా మరణాలు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 5,394 యాక్టివ్ కేసులున్నాయి.ఇక గుంటూరు జిల్లాలో అత్యధికంగా 225 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 13 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో  పల్లె, పట్నం తేడా లేకుండా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ద్వారా కాంటాక్ట్స్‌ పెరిగి పాజిటివ్‌లు ఎక్కువైపోతున్నాయి. దీంతో జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య అంతకంతకూ రెట్టింపవుతోంది.

రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. శనివారం నుంచి రోడ్లపైకి వచ్చిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్‌లు లేనివారికి జరిమానాలు విధించడం ప్రారంభించారు. మొదటిసారి పట్టుబడితే రూ.250, రెండోసారి రూ.500 తప్పదని హెచ్చరిస్తున్నారు.

ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. కరోనా కేసుల దృష్ట్యా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలని హితవు చెప్పారు. కరోనా వ్యాప్తి కట్టడికి పోలీసు శాఖకు సహకరించాలని కోరుతూ కోవిడ్ నిబంధనలు పాటించకపోతే భారీగా జరిమానాలు విధించక తప్పదని హెచ్చరించారు. 

అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్ధన్నారు. ఫంక్షన్స్, పార్టీలు వీలైతే వాయిదా వేసుకోవాలని సూచించారు.మాస్క్, భౌతికదూరం, శానిటైజర్ వాడటం అలవాటుగా మార్చుకోవాలని స్పష్టం చేశారు. స్కూల్స్, కాలేజీల్లో భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు.